కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోయిన సినీ హీరో

  • హీరో నిఖిల్ గౌడకు పరాజయం
  • రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నిఖిల్ గౌడ
  • నిఖిల్ గౌడ... మాజీ సీఎం కుమారస్వామి తనయుడు
  • రామనగర నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ విజయం
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనంతో ప్రముఖులు సైతం ఓటమి చవిచూశారు. కాంగ్రెస్ దెబ్బకు పరాజయంపాలైన వారిలో కన్నడ యువ హీరో నిఖిల్ గౌడ కూడా ఉన్నారు. నిఖిల్ గౌడ ఎవరో కాదు... కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తనయుడు. 

నిఖిల్ గౌడ జేడీ (ఎస్) అభ్యర్థిగా రామనగర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థి ఇక్బాల్ హుస్సేన్ 10 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో రామనగర స్థానంలో విజేతగా నిలిచారు. ఇక్బాల్ హుస్సేన్ కు 87,285 ఓట్లు రాగా, హీరో నిఖిల్ గౌడకు 76,439 ఓట్లు వచ్చాయి. 

వాస్తవానికి రామనగర స్థానం నుంచి కుమారస్వామి భార్య పోటీ చేయాలని భావించారు. అయితే చివరి నిమిషంలో ఆమె ఈ స్థానాన్ని తన కుమారుడు నిఖిల్ గౌడ కోసం త్యాగం చేశారు. 

ఇక నిఖిల్ కు రాజకీయాలు ఏమంత కలిసిరాలేదనే చెప్పాలి. నాలుగేళ్ల కిందట మాండ్యా పార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లోనూ నిఖిల్ గౌడ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో నటి సుమలత చేతిలో నిఖిల్ ఓడిపోయారు. 

కాగా, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ (ఎస్) పార్టీకి 19 సీట్లే వచ్చాయి. ఎన్నికల ఫలితాలకు ముందు, కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం వస్తుందని, జేడీ(ఎస్) కింగ్ మేకర్ అవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు. కానీ, కాంగ్రెస్ (136) అంచనాలకు మించి ఫలితాలు అందుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ సాధించింది.


More Telugu News