కర్ణాటకలో పూర్తయిన ఓట్ల లెక్కింపు.. ఎవరికెన్ని స్థానాలు వచ్చాయంటే...!

  • ఈ నెల 10న పోలింగ్.. నేడు ఓట్ల లెక్కింపు
  • ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు వరకు కౌంటింగ్
  • కాంగ్రెస్ కు 135 స్థానాలు.. బీజేపీకి 66 స్థానాలు 
దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పర్వం నేటితో ముగిసింది. ఈ నెల 10న కర్ణాటకలో పోలింగ్ జరగ్గా, నేడు ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగింది. 

మొత్తం 224 స్థానాలకు గాను కాంగ్రెస్ 135 చోట్ల విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 113 కాగా... 23 స్థానాలు ఎక్కువే గెలిచిన హస్తం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఉరకలు వేస్తోంది. రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యాలయాల వద్ద ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ నేతలు, కార్యర్తలు స్వీట్లు పంచుకుంటూ, బాణసంచా కాల్చుతూ, ఆనందోత్సాహాలతో నృత్యాలు చేశారు.

దిమ్మరపోయే ఫలితాలు చవిచూసిన అధికార బీజేపీ 66 సీట్లకే పరిమితం అయింది. జనతాదళ్ (ఎస్) 19 స్థానాల్లో నెగ్గగా, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు. 

ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని 42 నియోజకవర్గాల్లో బీజేపీ తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో 21 చోట్ల నెగ్గిన బీజేపీ, మరో 21 చోట్ల ఓడిపోయినట్టు తెలుస్తోంది.


More Telugu News