ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎవరు నిర్ణయిస్తారో క్లారిటీ ఇచ్చిన మల్లికార్జున ఖర్గే

  • సోనియా, రాహుల్ నిర్ణయిస్తారని ఖర్గే వ్యాఖ్య
  • రాష్ట్రంలో బీజేపీ దుష్టపాలనకు ముగింపు పలికారన్న ఖర్గే
  • కొత్తగా గెలిచిన కాంగ్రెస్ సభ్యులను బెంగళూరుకు రావాలని ఆదేశం
కర్ణాటకలో కాంగ్రెస్ విజయం ఖాయమైన నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అంశంపై చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రిగా ఎవరికి బాధ్యతలు అప్పగించాలనే విషయాన్ని కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నిర్ణయిస్తారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అద్భుత పనితీరు కనబరిచిందని, రాష్ట్రంలో బీజేపీ దుష్ట పాలనకు ప్రజలు ముగింపు పలికారన్నారు.

కొత్తగా గెలిచిన కాంగ్రెస్ సభ్యులందరూ సాయంత్రంలోగా బెంగళూరుకు రావాలని ఆదేశించామని, ప్రభుత్వ ఏర్పాటుకు తగిన విధానాలను పార్టీ అనుసరిస్తుందని తెలిపారు. ఈ సాయంత్రంలోగా గెలిచిన తమ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రావాలని ఆదేశాలు పంపించినట్లు చెప్పారు. ఈ సాయంత్రంలోగా వారు ఇక్కడికి వస్తారని, వచ్చిన తర్వాత వారికి విధిగా సూచనలిస్తారని, ఆ తర్వాత హైకమాండ్ పరిశీలకులను పంపుతుందని చెప్పారు. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటు కోసం తగిన ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

కాంగ్రెస్ విజయం జనతా జనార్దన విజయమని, ప్రత్యర్థి బీజేపీ కంటే స్పష్టమైన ఆధిక్యం ప్రజల ఘనతే అన్నారు. ప్రజలు తమకు పూర్తి మద్దతు ఇచ్చారని, దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా వారు కోపంతో మాకు ఓటు వేశారన్నారు. కర్ణాటక ఓటర్లు జాగృతమయ్యారనేందుకు ఇదే నిదర్శనం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, డజన్ల కొద్దీ మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాల మంత్రులు ఇక్కడ క్యాంప్‌ వేసుకుని, అంగబలం, ధనబలం, కండబలం ఉపయోగించినా ప్రజలు కలిసికట్టుగా కాంగ్రెస్‌కే పట్టం కట్టారన్నారు.


More Telugu News