నా కొడుకు కోసమే తిరిగొచ్చి ఆడుతున్నా: పీయూష్ చావ్లా

  • గతంలో తన ఆటను అతడు చూడలేదని వెల్లడి
  • ఇప్పుడు మ్యాచ్ లు చూస్తూ అర్థం చేసుకుంటున్నట్టు ప్రకటన
  • అతడుబ్యాటర్ గా ఎదగాలన్నది తన కోరిక అని చెప్పిన చావ్లా
ఐపీఎల్ 2023లో ముంబై ఇండియన్స్ తరఫున సీనియర్ ఆటగాడు పీయూష్ చావ్లా అదరగొడుతున్నాడు. ఇప్పటికే 12 మ్యాచుల్లో అతడు 19 వికెట్లు తీశాడు. నిజానికి ముంబై ఇండియన్స్ అవకాశం ఇవ్వకపోతే చావ్లా ఐపీఎల్ లో కనిపించే వాడే కాదు. ఎందుకంటే చివరి మెగా వేలంలో అతడ్ని ఎవరూ కొనుగోలు చేయలేదు. దీంతో ఐపీఎల్ 2022లో కామెంటేటర్ గా పని చేసుకోవాల్సి వచ్చింది. 

అయినప్పటికీ దేశవాళీ క్రికెట్ లో చావ్లా సత్తా చాటడం అతడి అవకాశాలను మెరుగుపరిచింది. విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీ లో 16 వికెట్లు తీశాడు. దీంతో అతడ్ని గుర్తించిన ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుంది. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అతడు ఈ సీజన్ లో నిలబెట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పర్పుల్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉన్నాడు. విరామం తర్వాత ఐపీఎల్ లోకి ఎందుకు వచ్చానన్నది అతడు మీడియాకు వెల్లడించాడు.

‘‘నేను ఆడాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో నేను ఏ క్యాంపులకు వెళ్లలేదు. కానీ ఈ ఏడాది అన్ని క్యాంపులకు హాజరయ్యాను. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్, పార్థీవ్ పటేల్ ఎంతో సాయం చేశారు. దాంతో డీవై పాటిల్, ముస్తక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీల్లో ఆడగలిగాను. ఇది నాకు ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే ఇది కేవలం పునరాగమనానికి సంబంధించినదే కాదు. నేను నా కుమారుడి కోసం ఆడాలని అనుకుంటున్నాను. నేను లోగడ ఆడుతున్న సమయంలో అతడు చూడలేదు. అతడు అప్పుడు మరీ చిన్నోడు. ఇప్పుడు ఆరేళ్లు వచ్చాయి. దీంతో ఆటను అర్థం చేసుకోవడం మొదలు పెట్టాడు. మ్యాచ్ చూస్తే, దాన్ని ఫాలో అవుతున్నాడు. అందుకే అతడి కోసం ఆడాలనుకున్నాను. ఆట పూర్తవ్వగానే రివ్యూ చేస్తున్నాడు. అతడే నాకు పెద్ద విమర్శకారి’’ అని చావ్లా చెప్పాడు. 

అంతేకాదు తన కుమారుడు బౌలర్ కావడం తనకు ఇష్టం లేదని కూడా తెలిపాడు. అతడు బ్యాటర్ గా ఎదగాలన్నది తన కల అని చెబుతూ, అందుకే అతడికి తానే శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించాడు. నెట్స్ లో బౌలింగ్ చేస్తున్నానని చెప్పారు. తనకు ఐపీఎల్ లో రూ.50 లక్షలు ఇస్తున్నారని.. తన కుమారుడు బ్యాటర్ గా ఎదిగితే, మరో పదేళ్లలో అతడి కోసం రూ.20 కోట్లు అయినా ఇస్తారని వ్యాఖ్యానించాడు. రూ.20 కోట్లను తన కొడుకు కోసం పక్కన పెట్టుకోవాలని ముంబై ఇండియన్స్ కు చెప్పినట్టు ప్రకటించాడు.


More Telugu News