రాహుల్ కు శిక్ష విధించిన న్యాయమూర్తి సహా గుజరాత్ న్యాయమూర్తుల పదోన్నతులపై సుప్రీం స్టే

  • పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించిన జడ్జి హస్‌ముఖ్ భాయ్ వర్మ
  • జిల్లా జడ్జిగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు
  • వారిని పూర్వస్థానాలకు పంపాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు
  • వారికి పదోన్నతులు ఎలా కల్పించారో చెప్పాలని గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దాఖలైన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి శిక్ష విధించిన సూరత్ చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ హస్‌ముఖ్ భాయ్ వర్మ పదోన్నతిని సుప్రీంకోర్టు అడ్డుకుంది. ఆయన సహా 68 మంది దిగువ కోర్టు న్యాయమూర్తులను జిల్లా జడ్జీలుగా నియమిస్తూ గుజరాత్ హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించింది.  

2011లో సవరించిన ‘గుజరాత్ స్టేట్ జుడీషియల్ సర్వీస్ రూల్స్, 2005’ ప్రకారం మెరిట్ కమ్ సీనియారిటీ విధానంలో అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారితో 65 శాతం రిజర్వేషన్ ప్రాతిపదికన జిల్లా జడ్జి పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వం మాత్రం దీనికి విరుద్ధంగా సీనియారిటీ కమ్ మెరిట్ ప్రాతిపదికన 68 మందికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో సీనియర్ సివిల్ జడ్జి కేడర్‌కు చెందిన రవికుమార్ మెహతా, సచిన్ ప్రతాప్ రాయ్ మెహతా అనే ఇద్దరు అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారించిన న్యాయస్థానం ఏప్రిల్ 13న గుజరాత్ ప్రభుత్వానికి, గుజరాత్ హైకోర్టు రిజస్ట్రార్‌కు నోటీసులు పంపింది. అయినప్పటికీ ప్రభుత్వం వాటిని లెక్కచేయకుండా జడ్జీలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది.

‘గుజరాత్ స్టేట్ జుడీషియల్ సర్వీస్ రూల్స్, 2005’ను ఉల్లంఘించి పదోన్నతులు కల్పించారని, ఇది చట్టవిరుద్ధమని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది. పదోన్నతులు పొందిన జడ్జీలందరినీ అంతకుముందున్న స్థానాలకు పంపాలని ఆదేశించింది. పదోన్నతులు ఎలా కల్పించారో చెప్పాలని, మెరిట్ లిస్ట్‌ను తమ ముందు ఉంచాలని గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను న్యాయస్థానం ఆదేశించింది.


More Telugu News