ధాన్యం కొనకపోతే తాడేపల్లిలోని మీ ఇంటికే తీసుకొస్తామని చెప్పా: చంద్రబాబు

  • అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు
  • ప్రతి గింజ కొనాల్సిందేనన్న చంద్రబాబు
  • ప్రభుత్వానికి 72 గంటల సమయం ఇచ్చానని వెల్లడి
  • ఇంత అసమర్థ ప్రభుత్వాన్ని చూడలేదని వ్యాఖ్యలు
టీడీపీ అధినేత చంద్రబాబు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల పరిస్థితి పట్ల తీవ్రస్థాయిలో స్పందించారు. వైసీపీ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. తాను పర్యటనకు వస్తే మండుటెండలు కూడా లెక్కచేయకుండా వేలమంది రైతులు వచ్చారని, ఇరగవరం నుంచి తణుకు వరకు తనతో పాటు పాదయాత్ర చేశారని చంద్రబాబు వెల్లడించారు. 

"అకాల వర్షంతో రైతుల తీవ్రంగా నష్టపోయారు. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే సీఎం జగన్ కు ఏమాత్రం పట్టడంలేదు. రైతు సంక్షోభంలో ఉంటే ఈ సీఎంకు పరామర్శించే తీరిక లేదా? రైతులు పంట నష్టపోయి బాధపడుతుంటే వైసీపీ ప్రభుత్వం మొద్దునిద్రలో ఉంది. చేతగాని, అసమర్థ ప్రభుత్వం వల్లే ఇన్ని అనర్థాలు. రైతు కంట కన్నీరు చిందడానికి ఈ సైకో సర్కారే కారణం. బాధ్యతల నుంచి తప్పించుకునే వ్యక్తికి రాష్ట్రాన్ని పాలించే అర్హత ఉంటుందా? 

ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు కాపాడుకోవాలి. పంట మునిగింది... పరిహారం ఇవ్వాలనే కదా అడిగాం. రైతు వద్ద ఉన్న ప్రతి గింజను ప్రభుత్వం కొనాలి. ఈ ప్రభుత్వానికి 72 గంటల సమయం ఇచ్చాను. ధాన్యం కొనకపోతే తాడేపల్లిలోని మీ ఇంటికే తీసుకువస్తామని స్పష్టం చేశాను. కానీ, 72 గంటలైనా సమస్య పరిష్కరించలేని ప్రభుత్వం ఇది. రైతులకు గోతాలు కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది. రైతులకు పాతవి, చిల్లులు పడిన గోనె సంచులు ఇస్తారా?" అంటూ చంద్రబాబు నిలదీశారు. 

దేశంలోనే రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని వెల్లడించారు. ఎక్కువ అప్పు ఉండే రాష్ట్రాల్లో ఏపీ నెంబర్ వన్ అని తెలిపారు.


More Telugu News