విటమిన్ సప్లిమెంట్లు మీ శరీరానికి పడకపోతే కనిపించే లక్షణాలు ఇవే..!

  • విటమిన్ సీ మోతాదు ఎక్కువైతే కిడ్నీలో రాళ్లు
  • విటమిన్ బీ12 పడకపోతే తలతిరగడం, తలనొప్పి సమస్యలు
  • ఒమెగా ఫ్యాటీ3 ఔషధాలతో రక్తస్రావం రిస్క్
  • వైద్యుల సూచనలతోనే ఔషధాలు తీసుకోవాలి
మనలో కొందరికి వైద్యులు విటమిన్, మినరల్స్ సప్లిమెంట్లను సూచిస్తుంటారు. వాటి లోపంతో కొన్ని రకాల అనారోగ్యాలు వస్తుంటాయి. పోషకాల లోపం ఉందని గుర్తించిన సందర్భాల్లో వైద్యులు ఇలా విటమిన్, మినరల్స్ ను రోజువారీ, పరిమిత కాలం పాటు వాడుకోవాలని చెబుతుంటారు. వైద్యులు సూచించిన వారు మినహా, ఇతరులు వీటిని సొంతంగా తీసుకోకూడదు. ఎందుకంటే వీటివల్ల దుష్ప్రభావాలు కూడా కనిపిస్తాయి. నిజంగా వీటి అవసరం ఉన్న వారే వాడుకోవాలి కానీ అందరూ కాదు.

దుష్ప్రభావాలు..
విటమిన్, మినరల్స్ ట్యాబెట్లు లేదా క్యాప్సుల్స్, సిరప్ రూపంలో తీసుకునే ప్రతి ఒక్కరికీ దుష్ప్రభావాలు కలుగుతాయని చెప్పలేం. అవసరమైన వారే, అది కూడా వైద్యులు సూచించిన మోతాదు మేరకు తీసుకోవాలి. మోతాదు మించితే దుష్ప్రభావాలు కనిపించొచ్చు. 

విటమిన్ సీ: విటమిన్ సీని చాలా సురక్షితమైనదిగా ఎక్కువ మంది భావిస్తుంటారు. కానీ డోసేజ్ ఎక్కువ అయితే జీర్ణ సమస్యలు కనిపిస్తాయి. నీళ్ల విరేచనాలు (డయేరియా), కడుపులో నొప్పితోపాటు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. 
విటమిన్ బీ12: విటమిన్ బీ12 అన్నది కొద్ది మొత్తంలో తీసుకుంటే సరిపోతుంది. బీ12 లోపం ఉన్నా, లేకపోయినా ఈ సప్లిమెంట్ అందరికీ పడదు. ఇలా పడని వారికి ఇంజెక్షన్ రూపంలో ఇస్తుంటారు. సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల తల తిరగడం, విరేచనాలు, తలనొప్పి కనిపిస్తాయి. 
ఒమెగా 3: వీటిని చేప నూనె నుంచి తయారు చేస్తుంటారు. వీటిని తీసుకున్న వారిలో నోటి దుర్వాసన, జీర్ణ సమస్యలు కనిపించొచ్చు. రక్తం పలుచన పడేందుకు ఔషధం తీసుకునే వారికి రక్తస్రావం కూడా కావచ్చు. 
ఐరన్ : ఐరన్ సప్లిమెంట్లతో మలబద్ధకం కనిపించొచ్చు. అలాగే తల తిరగడం, కడుపులో నొప్పి కనిపిస్తాయి. కొందరిలో అరుదుగా ఐరన్ మోతాదు పెరగడం వల్ల హిమక్రోమోటోసిస్ పరిస్థితి ఏర్పడొచ్చు. 

హెర్బల్ ఔషధాలు, బరువు తగ్గేవి, హార్మోన్ ఆధారిత ఔషధాలతోనూ రిస్క్ లు ఉన్నాయి. అలెర్జిక్ రియాక్షన్ కనిపించొచ్చు. కనుక కొత్తగా ఏ సప్లిమెంట్ తీసుకుంటున్నా వైద్యులను అడిగిన తర్వాతే ఆ పనిచేయాలి. ఎందుకు దుష్ప్రభావాలు అని అంటే.. చెప్పేందుకు ఏదో ఒక సూటి కారణం లేదు. డోసేజీ అధికం అయినా, ఇతర మందులతో కలవడం వల్ల, ఇతన ఆరోగ్య సమస్యలున్న వారిలో దుష్ప్రభావాలు రావొచ్చు. అందుకే ఏ ట్యాబ్లెట్ అయినా వైద్యుల సూచన లేకుండా తీసుకోవద్దు.


More Telugu News