కాంగ్రెస్ గెలిస్తే సీఎం మీరే అవుతారా? అనే ప్రశ్నకు డీకే శివకుమార్ ఆసక్తికర సమాధానం

  • కాంగ్రెస్ కు మెజార్టీ వస్తుందంటున్న పలు ఎగ్జిట్ పోల్స్
  • సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకేల మధ్య పోటీ
  • కాంగ్రెస్ గెలిచిన తర్వాత తన కార్యాచరణ ఉంటుందన్న డీకే
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్న తరుణంలో సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. పలు ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కే ఆధిక్యత వస్తుందని అంచనా వేశాయి. మరోవైపు, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సీఎం ఎవరనే చర్చ కూడా పెద్ద ఎత్తున సాగుతోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ల మధ్య పోటీ నెలకొంది.  నేపథ్యంలో ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఎగ్జిట్ పోల్స్ కు వాటి సొంత థియరీ ఉంటుందని డీకే అన్నారు. ఎగ్జిట్ పోల్స్ శాంపుల్స్ ఆధారంగా తాము ముందుకు వెళ్లబోమని... ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సక్సెస్ అయ్యాయని, మరికొన్ని ఫెయిల్ అయ్యాయని, అందుకే వాటిని పట్టించుకోబోమని స్పష్టం చేశారు. తన శాంపుల్ సైజ్ చాలా పెద్దదని... తన శాంపుల్స్ ప్రకారం కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించడం మాత్రమే కాకుండా, కావాల్సినంత మెజార్టీని సాధిస్తుందని చెప్పారు. 

బీజేపీ, కాంగ్రెస్ లు తమను సంప్రదించాయని, తాము ఎవరికి మద్దతిస్తామో సరైన సమయంలో చెపుతామన్న జేడీఎస్ సీనియర్ నేత తన్వీర్ అహ్మద్ వ్యాఖ్యలపై స్పందిస్తూ... దీనిపై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. వాళ్ల పార్టీని, జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లు వాళ్లకిష్టమైన నిర్ణయం తీసుకోవచ్చని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరే ముఖ్యమంత్రి అవుతారా అనే ప్రశ్నకు సమాధానంగా... తొలుత కాంగ్రెస్ గెలవడం ముఖ్యమని, పార్టీ గెలిచిన వెంటనే తన కార్యాచరణ మొదలవుతుందని అన్నారు.


More Telugu News