వేలంలో రూ.41 లక్షలు పలికిన వాచ్

  • 1967లో రూ.7,000కు కొన్న వాచ్
  • రోలెక్స్ సబ్ మెరైనర్ మోడల్ వాచ్ కు డిమాండ్
  • నీటిలోనూ పనిచేసే ప్రత్యేకత దీని సొంతం
ఖరీదైన రిస్ట్ వాచ్ బ్రాండ్లలో రోలెక్స్ ఒకటి. అప్పట్లోని రిస్ట్ వాచ్ లు బ్యాటరీ అవసరం లేకుండా జీవిత కాలం పాటు పనిచేసే మెకానిజంతో వచ్చేవి. ఇప్పుడు బ్యాటరీ ఆధారిత వాచ్ లు ఎక్కువగా కనిపిస్తాయి. పాతకాలం నాటివి చాలా అరుదుగానే చూడొచ్చు. అలాంటి ఓ రోలెక్స్ వాచ్ వేలానికి వచ్చింది. ఎప్పుడో 1967లో రోలెక్స్ వాచ్ ను రూ.7,000కు కొనుగోలు చేశారు. అప్పట్లో రూ.7 వేలు అంటే చాలా పెద్ద మొత్తమే. ఆ వాచ్ ఇప్పుడు వేలంలో ఏకంగా రూ.41,11,692 కు అమ్ముడుపోయింది.

ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న సామెత వినే ఉంటారు. కొన్ని రకాల ఉత్పత్తులకు ఇది అన్వయం అవుతుంది. 1953లో రోలెక్స్ కంపెనీ సబ్ మెరైనర్ మోడల్ ను విడుదల చేసింది. దీన్నే ద డైవర్స్ వాచ్ అని కూడా అంటారు. నీటిలో డైవింగ్ చేసే సమయంలోనూ ధరించతగినది. నీటిలో 330 అడుగుల లోతులోనూ చక్కగా పనిచేస్తుంది. రాయల్ నేవీలో పనిచేసిన సైమన్ బార్నెట్ దీన్ని 1967లో కొనుగోలు చేశారు. 2019లో సైమన్ బార్నెట్ మరణించడంతో, ఆయన కుమారుడు పెటే బార్నెట్ ఈ వాచ్ ను నార్ ఫోల్క్ పట్టణంలో వేలం నిర్వహించాడు. నేవీలో పని చేసిన సమయంలో తన తండ్రి ఈ వాచ్ ను ఉపయోగించినట్టు పెటె బార్నెట్ తెలిపారు.


More Telugu News