రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించవచ్చు
- మార్కెట్లో కొంతమంది వ్యాపారుల నిర్వాకం
- త్వరగా పక్వానికి రావడానికి రసాయనాల వాడకం
- ప్రమాదకరమైన ఈ రసాయనాలతో ఆరోగ్యానికి ముప్పు
మామిడి పండ్లను చిన్నాపెద్దా తేడా లేకుండా అంతా ఇష్టంగా తింటుంటారు. మామిడి పండ్ల కోసం వేసవికాలం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసే వాళ్లు కూడా ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. మార్కెట్లోకి మామిడి పండ్లు రాగానే కొని తినేయాలని ఆత్రుతపడుతుంటారు. ఈ ఆత్రుత వల్ల కొంతమంది వ్యాపారులు కృత్రిమ పద్ధతులతో మామిడి కాయలను పండ్లుగా మారుస్తున్నారు. ప్రమాదకరమైన రసాయనాలను ఇందుకోసం వాడుతున్నారు. ఈ పండ్లను తినడం వల్ల అనారోగ్యాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో ఉన్న మామిడి పండ్లలో కృత్రిమంగా పండించిన వాటిని గుర్తించేందుకు నిపుణులు చెబుతున్న టిప్స్ మీకోసం..
- సహజంగా పండిన మామిడి పండ్లు అక్కడక్కడా బ్రౌన్ కలర్ మచ్చలతో ఉంటాయి. రసాయనాలు వాడిన మామిడి పండ్లలో తెల్ల మచ్చలు కనిపిస్తాయి.
- మామిడి పండ్లను తొడిమల దగ్గర వాసన చూడడం ద్వారా కూడా రసాయనాలు వాడిన పండ్లను గుర్తించవచ్చు. పండ్లు తీయటి వాసన వస్తుంటే సహజంగా పండినవి, ఆల్కహాలిక్ వాసన వస్తుంటే రసాయనాలతో మగ్గబెట్టినవని గుర్తించాలి.
- మామిడి పండ్లను నీటిలో వేస్తే మునిగిన పండ్లు సహజంగా పండినవని అర్థం.. అలా కాకుండా నీటిపై తేలుతుంటే అవి కృత్రిమ పద్ధతులతో పండించినవని అర్థం చేసుకోవాలి.
- పండ్లను కాస్త నొక్కి చూస్తే.. అంతటా మెత్తగా ఉన్న పండ్లు సహజమైనవి, కొన్నిచోట్ల గట్టిగా ఉన్న పండ్లు రసాయనాలతో పండించినవని తెలిసిపోతుంది.
- మామిడి పండ్లను తిన్నప్పుడు గొంతులో ఇరిటేషన్ గా అనిపిస్తుంటే అవి కచ్చితంగా రసాయనాలతో పండించినవనే అర్థం.