ఏపీ ప్రభుత్వానికి షాక్.. జీవో నెంబర్ 1ను కొట్టేసిన హైకోర్టు

  • రహదారులు, కూడళ్లలో సభలు, సమావేశాలు పెట్టకూడదంటూ జీవో నెంబర్ 1ని తెచ్చిన ప్రభుత్వం
  • హైకోర్టును ఆశ్రయించిన విపక్ష పార్టీలు
  • ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా జీవో ఉందన్న హైకోర్టు
వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో చుక్కెదురయింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ను హైకోర్టు కొట్టేసింది. రహదారులపైనా, కూడళ్లలోనూ సభలు, సమావేశాలు, రోడ్ షోలు పెట్టకూడదంటూ ప్రభుత్వం ఈ జీవోను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ర్యాలీలు, సభలకు పోలీసుల అనుమతి కచ్చితంగా ఉండాల్సిందేనని, వీటి పూర్తి వివరాలను పోలీసులకు ఇవ్వాలని జీవో పేర్కొంటోంది. 

ఈ క్రమంలో, ఈ జీవోను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు వీర వెంకట రుద్రరాజు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, ఏఐఎస్ఎఫ్ ప్రధాన కార్యదర్శి శివారెడ్డి, ఐఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్రబాబు తదితరులు హైకోర్టులో పిటిషన్లు వేశారు. పోలీస్ యాక్ట్ 30కి భిన్నంగా ఈ జీవో ఉందని పిటిషనర్ల తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రోడ్ షోలను కట్టడి చేసేలా జీవో ఉందని... ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే ఈ జీవోను తీసుకొచ్చారని కోర్టుకు తెలిపారు. 

ఈ పిటిషన్లను జనవరి 24న హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తీర్పును వెలువరిస్తున్న సందర్భంగా హైకోర్టు స్పందిస్తూ... ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా జీవో నెంబర్ 1 ఉందని వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 1ని సస్పెండ్ చేస్తూ తీర్పును వెలువరించింది.


More Telugu News