చంద్రబాబు కాన్వాయ్‌లోకి చొరబడిన వైసీపీ వాహనాలు.. 15 కిలోమీటర్లు ఫాలో అయినా గుర్తించలేకపోయిన పోలీసులు!

  • ఉండవల్లి నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరికి చంద్రబాబు
  • ఉంగుటూరు సమీపంలో కాన్వాయ్‌లోకి చొరబడిన రెండు వైసీపీ వాహనాలు
  • ఎన్ఎస్‌జీ సిబ్బంది అప్రమత్తం కావడంతో తొలగించిన ఎస్కార్ట్ సిబ్బంది 
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కాన్వాయ్‌లోకి చొచ్చుకెళ్లిన వైసీపీ వాహనాలు దాదాపు 15 కిలోమీటర్ల పాటు అనుసరించాయి. అయినప్పటికీ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించారు. చంద్రబాబు నిన్న ఉండవల్లిలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరారు. ఈ క్రమంలో ఉంగుటూరు సమీపంలో వైసీపీకి చెందిన రెండు వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌లోకి చొరబడ్డాయి. అలా చంద్రబాబు కాన్వాయ్‌లోకి చేరిన వాహనాలు 15 కిలోమీటర్లపాటు అనుసరించాయి. అయినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు భద్రతా నిబంధనల ప్రకారం ఆయన కాన్వాయ్‌లోకి ప్రైవేటు వాహనాలను అనుమతించకూడదు. ఒకవేళ పొరపాటున వచ్చి చేరినా వాటిని వెంటనే తప్పించాల్సి ఉంటుంది. బాబు కాన్వాయ్‌లోకి వైసీపీ వాహనాలు వచ్చిన విషయం తెలిసినా ఎస్కార్ట్ సిబ్బంది పట్టించుకోకపోవడం భద్రతా లోపాలను బయటపెట్టింది. చివరికి ఎన్ఎస్‌జీ సిబ్బంది గుర్తించడంతో ఎస్కార్ట్ పోలీసులు అప్పుడు అప్రమత్తమై వాటిని తప్పించారు.


More Telugu News