బీసీసీఐపై మరోసారి కురవనున్న వేల కోట్ల వర్షం

  • ఐసీసీ నూతన ఆర్థిక విధానంలో బీసీసీఐకి భారీ ఆదాయం 
  • ఐసీసీకి వచ్చే ఆదాయంలో 38.50 శాతం భారత్ కే!
  • నాలుగేళ్లలో ఏడు వేల కోట్లు ఆర్జించనున్న భారత బోర్డు
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్‌ బోర్డుగా పేరున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) ఆర్థికంగా మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే ఐపీఎల్‌ ద్వారా వేల కోట్లు ఆర్జిస్తున్న బీసీసీఐ ఇప్పుడు ఐసీసీ కొత్త ఆర్థిక మోడల్‌ ద్వారా  వేల కోట్లు అందుకోనుంది. 2024–27 నాలుగేళ్ల కాలానికి ప్రతిపాదిత ఐసీసీ నూతన ఆదాయ పంపిణీ వ్యవస్థకు ఆమోదం తెలిపితే బీసీసీఐ పంట పండనుంది.  

ఈ నాలుగేళ్ల కాలంలో  ప్రతీ ఏడాది 600 మిలియన్‌ డాలర్ల మేర ఐసీసీకి నికర ఆదాయం లభిస్తుందని అంచనా వేశారు.  ఇందులో మెజారిటీ షేరు 38.50 శాతం (231 మిలియన్‌ డాలర్లు) బీసీసీఐకి ఐసీసీ పంచనుంది. అంటే ఏడాదికి రూ.1,886 కోట్లు భారత బోర్డుకు రానున్నాయి. నాలుగేళ్లలో ఏడు వేల పైచిలుకు కోట్ల ఆదాయం లభించనుంది. 

ఐసీసీకి లభించే మొత్తం ఆదాయం నుంచి 88.81 శాతం 12 శాశ్వత సభ్య దేశాలకు, మిగిలిన 11.19 శాతం అనుబంధ దేశాల బోర్డులకు పంచుతారు. ఆ దేశ క్రికెట్‌ చరిత్ర, గత 16 ఏళ్ల కాలంలో ఐసీసీ టోర్నమెంట్లలో పురుషులు, మహిళల జట్ల ప్రదర్శన, ఐసీసీ వాణిజ్య ఆదాయానికి ఆ దేశం నుంచి సహకారం, శాశ్వత సభ్యత్వ హోదాకు సమానమైన వెయిటేజీ ప్రకారం ఐసీసీ ఆయా దేశాలకు ఆదాయాన్ని పంచనుంది. 

ఇక ఇందులో అత్యధికంగా భారత్ కు 38.50 శాతం కేటాయించనుంది. రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్‌కు 6.89 శాతం, మూడో స్థానంలోని ఆస్ట్రేలియాకు 6.25 శాతం షేర్‌ లభించనుంది. కాగా, ఐసీసీకి వివిధ రూపాల్లో ఆదాయం సమకూరుతుంది. అందులో మీడియా హక్కులదే ప్రధాన భాగం. తొలిసారిగా భారత మార్కెట్‌ సహా ఐదు వేర్వేరు రీజియన్లకు ఈ మధ్యే మీడియా హక్కులు వేలం వేశారు. డిస్నీ స్టార్‌ భారత హక్కులను భారీ మొత్తంతో దక్కించుకుంది.


More Telugu News