14 ఏళ్లుగా రాత్రి భోజనం చేయట్లేదంటున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు

  • బరువు నియంత్రణకు తన సీక్రెట్ ఏంటో చెప్పిన మనోజ్ బాజ్‌పాయ్
  • రాత్రి భోజనం మానేయడం తాతను చూసి నేర్చుకున్నానని వెల్లడి
  • ఈ విధానంతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న నటుడు
  • నిత్యం ఆరోగ్యంగా, సంతోషంగా ఫీలవుతున్నట్టు పేర్కొన్న మనోజ్
ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌ సిరీస్‌తో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్న బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. త్వరలో ఫ్యామిలీ మ్యాన్-3  షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన మీడియాతో సరదాగా ముచ్చటించారు. గత 13-14 ఏళ్లుగా తాను రాత్రుళ్లు భోజనం చేయట్లేదని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. బరువు అదుపులో పెట్టుకునేందుకు ఇదే ఉత్తమమైన మార్గమని అభిప్రాయపడ్డారు. తన తాతను చూశాకే ఈ ఐడియా వచ్చిందని చెప్పుకొచ్చారు. 

‘‘మా తాతగారు సన్నగా, ఫిట్‌గా ఉండేవారు. కాబట్టి, ఆయన డైట్ ప్లాన్‌నే ఫాలో అవుదామని నిర్ణయించుకున్నాను. ఆ తరువాత క్రమంగా నా బరువు నియంత్రణలోకి వచ్చేసింది. నేను చాలా ఆరోగ్యంగా, ఎనర్జిటిక్‌గా ఫీలవుతున్నాను. మొదట్లో ఇలా రాత్రుళ్లు భోజనం మానుకోవడం కష్టంగా ఉండేది. కడుపులో ఆకలి కేకలు ఇబ్బంది పెట్టేవి. దీంతో, మంచినీళ్లు తాగి, హెల్త్ బిస్కట్స్ తినేవాణ్ణి. నా షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ డైట్‌ ప్లాన్‌లో చిన్న చిన్న మార్పులు చేశాను. కొన్ని సార్లు 12 గంటలు, మరికొన్ని సందర్భాల్లో 14 గంటలు ఏమీ తినకుండా ఉండేవాణ్ణి’’ అని ఆయన చెప్పుకొచ్చారు. 

ఈ తరహా ఆహారనియమంతో తనకు ఎన్నో ప్రయోజనాలు ఒనగూరాయని మనోజ్ బాజ్‌పాయ్ చెప్పుకొచ్చారు. తన ఆరోగ్యం మరింత మెరుగయ్యిందని, డయాబెటిస్, కొలెస్ట్రాల్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉండేందుకు సాయపడిందని చెప్పుకొచ్చారు. 

అయితే, ప్రతి రోజు రాత్రి ఏడు గంటల లోపు భోజనం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ రకంగా తక్కువ మోతాదులో రాత్రి భోజనం చేస్తే జీర్ణ వ్యవస్థ మెరుగవడంతో పాటూ శారీరక రుగ్మతలు దరిచేరవని చెబుతున్నారు.


More Telugu News