ఇది హుందాతనం అనిపించుకోదు.. రాహుల్ గాంధీకి ఢిల్లీ యూనివర్సిటీ నోటీసులు

  • ఢిల్లీ యూనివర్సిటీ మెన్స్ హాస్టల్ సందర్శనపై రాహుల్ గాంధీకి హాస్టల్ యాజమాన్యం నోటీసులు
  • రాహుల్ పర్యటన హాస్టల్ నిబంధనలను అతిక్రమించడమేనని ఘాటు వ్యాఖ్య
  • భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపట్టవద్దంటూ సూచన
ఇటీవల ఢిల్లీ యూనివర్సిటీ మెన్స్ పీజీ హాస్టల్‌ను ఆకస్మికంగా సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి యూనివర్సిటీ హాస్టల్ ప్రొవోస్ట్ బుధవారం నోటీసులు జారీ చేశారు. జెడ్-ప్లస్ సెక్యూరిటీ కలిగిన ఓ జాతీయ నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదని, హుందాతనం అనిపించుకోదని వ్యాఖ్యానించారు. ఆయన పర్యటనకు అనుమతి లేదని స్పష్టం చేశారు. గత వారం పీజీ హాస్టల్‌ను సందర్శించిన రాహుల్ గాంధీ అక్కడి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్శనపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ యూనివర్సిటీ హాస్టల్ అధికారి రెండు పేజీల నోటీసు జారీ చేశారు. 

రాహుల్ గాంధీ హాస్టల్‌కు విచ్చేయడం హద్దు మీరడమేనని, బాధ్యతారాహిత్యమని నోటీసుల్లో యూనివర్సిటీ ఘాటు వ్యాఖ్యలు చేసింది. మూడు వాహనాలు వెంటరాగా రాహుల్ గాంధీ హాస్టల్‌లో ఆకస్మికంగా ప్రవేశించడం నిబంధనలను ఉల్లంఘించడమేనని పేర్కొంది. హాస్టల్ నిబంధనల్లోని 15.13ను ప్రస్తావించిన ప్రొవోస్ట్.. హాస్టల్‌ పరిసర ప్రాంతాల్లో విద్య, రెసిడెంట్ కౌన్సిల్ సంబంధిత కార్యక్రమాలకు మాత్రమే అనుమతి ఉందని స్పష్టం చేశారు. 

హాస్టల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, ఇతర సభ్యులు.. రాహుల్ పర్యటనను ఖండించారని, పరిసరాల హద్దుమీరారని పేర్కొన్నట్టు ప్రొవోస్ట్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. హాస్టల్ విద్యార్థులు, సిబ్బంది, అధికారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపట్టొద్దని రాహుల్‌కు సూచించారు. అంతేకాకుండా, ఇలాంటి చర్యలను అడ్డుకునేందుకు హాస్టల్ యాజమాన్యానికి అన్ని హక్కులు ఉంటాయని కూడా పేర్కొన్నారు.


More Telugu News