పాకిస్థాన్‌లో బీభత్సం సృష్టిస్తున్న ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులు.. ప్రధాని షేబాజ్ షరీఫ్ ఇంటిపై పెట్రోలు బాంబులతో దాడి!

  • భూ బదిలీ అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్
  • ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత ఆందోళనలతో అట్టుడుకుతున్న దేశం
  • రెండు రోజుల్లో 14 ప్రభుత్వ కార్యాలయాలు, 21 పోలీసు వాహనాలకు నిప్పు
  • లండన్‌లోని పాక్ ప్రధాని ఇంటిని చుట్టుముట్టిన మాజీ అధ్యక్షుడి మద్దతుదారులు
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ తర్వాత ఆ దేశంలో చెలరేగిన అల్లర్లు కొనసాగుతున్నాయి. ఇమ్రాన్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా బీభత్సం సృష్టిస్తున్నారు. లాహోర్‌లోని ప్రధాని షేబాజ్ షరీఫ్ నివాసంపై నిన్న దాడిచేశారు. పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ)కి చెందిన 500 మందికిపైగా మద్దతుదారులు నిన్న తెల్లవారుజామున ప్రధాని ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. అంతేకాదు, ప్రధాని భవనంలోకి పెట్రోలు బాంబులు విసిరినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఆందోళనకారులు ప్రధాని నివాసానికి చేరుకున్నప్పుడు అక్కడ గార్డులు మాత్రమే ఉన్నారని పేర్కొన్నారు. అక్కడి పోలీసు పోస్టును వారు తగలబెట్టినట్టు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసుల బలగాలు అక్కడికి చేరుకోవడంతో ఆందోళనకారులు అక్కడి నుంచి పరారయ్యారు. 

ప్రధాని నివాసానికి చేరుకోవడానికి ముందు ఆందోళనకారులు అధికార పీఎంఎల్-ఎన్ సెక్రటేరియట్‌పైనా దాడి చేశారు. అక్కడున్న బారికేడ్లకు నిప్పు పెట్టారు. పంజాబ్‌లో రెండు రోజుల్లో మొత్తంగా 14 ప్రభుత్వ భవనాలు, 21 పోలీసు వాహనాలకు నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. అలాగే, పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడి మద్దతుదారులు లండన్‌లోని షేబాజ్ షరీఫ్ ఇంటిని చుట్టుముట్టారు. 

భూ బదిలీ అవినీతి కేసులో ఇమ్రాన్ అరెస్ట్ తర్వాత పాకిస్థాన్ భగ్గుమంది.  లాహోర్, పంజాబ్ సహా దేశంలోని పలు పట్టణాలు, నగరాల్లో ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. పోలీసులకు, ఇమ్రాన్ మద్దతుదారులకు జరిగిన ఘర్షణల్లో ఇప్పటి వరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 300 మంది గాయపడ్డారు.


More Telugu News