సల్మాన్‌ఖాన్‌ను బెదిరించిన నిందితుడి గుర్తింపు.. బ్రిటన్‌లో మెడిసిన్ చదువుతున్న విద్యార్థిపై లుకౌట్ నోటీసు జారీ

  • యూకేలో మెడిసన్ మూడో ఏడాది చదువుతున్న విద్యార్థి
  • భారత్‌కు రప్పించేందుకు ముంబై పోలీసుల ప్రయత్నాలు
  • ఇదే కేసులో మరో ఇద్దరి అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్‌‌ఖాన్‌ను బెదిరించిన కేసులో నిందితుడిని వైద్య విద్యార్థిగా గుర్తించారు. బ్రిటన్‌లో మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతున్న హర్యానా యువకుడే సల్మాన్‌ను బెదిరించినట్టు గుర్తించిన పోలీసులు అతడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. సల్మాన్‌ను చంపేస్తామంటూ నిందితుల నుంచి ఇటీవల ఓ ఈమెయిల్ వచ్చింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడు గోల్డీ బ్రార్‌తో ముఖాముఖి మాట్లాడి వ్యవహారాన్ని చక్కబెట్టుకోవాలని, లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ ఈ-మెయిల్‌లో హెచ్చరించారు.

ఈ కేసులో తొలుత రాజస్థాన్‌కు చెందిన ధకడ్ రామ్ బిష్ణోయ్‌ను నిందితుడిగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కూడా సల్మాన్‌కు బెదిరింపులు వచ్చాయి. నిందితుడు ఈసారి ముంబై పోలీస్ కంట్రోలు రూముకు ఫోన్ చేసి సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడిని నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, తాజా కేసులో యూకే నుంచి విద్యార్థిని భారత్‌కు రప్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.


More Telugu News