లైంగిక వేధింపుల కేసులో డొనాల్డ్ ట్రంప్‌కు షాక్.. కాలమిస్ట్ జీన్ కరోల్‌కు 5 మిలియన్ డాలర్లు చెల్లించాల్సిందేనన్న కోర్టు

  • 1995-96లో ట్రంప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కరోల్
  • మళ్లీ అధికార పీఠాన్ని అధిష్ఠించాలన్న ట్రంప్ ఆశలకు విఘాతం కలిగే అవకాశం
  • జ్యూరీ తీర్పుపై అప్పీలుకు వెళ్తామన్న ట్రంప్ న్యాయవాది 
  • ప్రపంచానికి చివరికి నిజం తెలిసిందన్న కరోల్
  • ఆమె ఎవరో కూడా తనకు తెలియదన్న ట్రంప్
కాలమిస్ట్ ఇ జీన్ కరోల్‌పై లైంగిక వేధింపుల కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ దోషిగా తేలారు. కరోల్‌కు 5 మిలియన్ డాలర్లు చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. అంతేకాదు, కరోల్‌ను అబద్ధాల కోరుగా అభివర్ణిస్తూ ట్రంప్ ఆమె పరువును రోడ్డున పడేసినట్టు కూడా జ్యూరీ నిర్ధారించింది. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బరిలోకి దిగాలన్న ట్రంప్ ఆశలకు ఇది విఘాతం కలిగించే అవకాశం ఉంది. జ్యూరీ తీర్పుపై రీ అప్పీలుకు వెళ్లనున్నట్టు ట్రంప్ తరపు న్యాయవాది టకోపినా తెలిపారు.

1995-96లో మన్‌హటన్‌లోని బెర్గ్‌డార్ఫ్ గుడ్‌మన్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌ డ్రెస్సింగు రూములో ట్రంప్ (76) తనపై అత్యాచారానికి పాల్పడినట్టు కరోల్ (79) ఆరోపించారు. అయితే, ఆమె ఆరోపణలను ట్రంప్ ఖండించారు. ఆమె ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, బూటకమని, పూర్తిగా అబద్ధమని 2022లో తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పేర్కొంటూ తన పరువుకు భంగం కలిగించారని కరోల్ సివిల్ విచారణలో ఇటీవల వాంగ్మూలం ఇచ్చారు.

జ్యూరీ తీర్పు అనంతరం కరోల్ మాట్లాడుతూ.. చివరికి ప్రపంచానికి నిజం తెలిసిందని అన్నారు. ఇది తన ఒక్కరి విజయమే కాదని, లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ప్రతి మహిళ విజయమని అభివర్ణించారు. 

ఏప్రిల్ 25న ఈ కేసు విచారణ ప్రారంభం కాగా, ఏ ఒక్క రోజూ ట్రంప్ విచారణకు హాజరు కాలేదు. జ్యూరీ తీర్పు అనంతరం ట్రంప్ తన సోషల్ మీడియా ‘ట్రూత్’లో పోస్టు చేస్తూ.. ఇది పూర్తిగా అవమానకరమని అన్నారు. అసలు ఆమె ఎవరో కూడా తనకు తెలియదని స్పష్టం చేశారు. కాగా, ఇది సివిల్ కేసు కాబట్టి ట్రంప్ జైలుకు వెళ్లే అవకాశం లేదు.


More Telugu News