ఉగ్ర లింక్స్ కొత్త కోణాలు: హైదరాబాదులో బయోటెక్నాలజీ విభాగం అధిపతి, డెంటిస్ట్, ఆటో డ్రైవర్.. అరెస్ట్

  • ఇంటెలిజెన్స్ సమాచారంతో హైదరాబాద్‌లో ఐదుగురి అరెస్ట్
  • డెంటిస్ట్ నుండి ఆటో డ్రైవర్ వరకు.. ఐదుగురు వివిధ వృత్తుల్లో..
  • మహమ్మద్ అబ్బాస్... వేణుకుమార్ గా పేరు మార్పు!
ఉగ్రవాద లింక్స్ కలిగిన ఐదుగురిని భోపాల్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వీరికి సంబంధించి కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఉగ్రవాద లింక్స్ కలిగిన వారిగా అనుమానిస్తున్న ఐదుగురు వివిధ రంగాల్లో ఉన్నారు. మహమ్మద్ సలీం ఓ కాలేజీలో బయోటెక్నాలజీ విభాగం అధిపతిగా పనిచేస్తున్నాడు. భోపాల్ కు చెందిన ఇతను కొన్ని రోజులుగా గోల్కొండలో ఉంటున్నట్లు గుర్తించారు.

ఒడిశాకు చెందిన అబ్దుల్ రహమాన్ క్లౌడ్ సర్వీసెస్ ఇంజినీర్ గా పని చేస్తూ గోల్కొండలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. గోల్కొండ బజార్ కు చెందిన షేక్ జునైద్ డెంటిస్ట్ గా పని చేస్తున్నాడు. హఫీజ్ నగర్ కు చెందిన మహమ్మద్ అబ్బాస్ అలీ ఆటో డ్రైవర్ గా, జగద్గిరిగుట్టలోని మగ్ధూమ్ నగర్ కు చెందిన మహ్మద్ హమీద్ దినసరి కూలీగా పని చేస్తున్నారు.

జవహర్ నగర్ బాలాజీనగర్ కు చెందిన మహమ్మద్ సల్మాన్ పరారీలో ఉన్నట్లు తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. భోపాల్ కు చెందిన 11 మంది ఉగ్రవాదులతో కలిసి ఈ ఆరుగురు పని చేస్తున్నట్లు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ముగ్గురు మతమార్పిడి చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితులు మహమ్మద్ సలీం పేరు సౌరభ్ రాజ్ వైద్య, అబ్దుల్ రహమాన్ పేరు దేవీప్రసాద్, మహమ్మద్ అబ్బాస్ పేరు వేణు కుమార్ గా నిందితుల పేర్లు ఉన్నాయి. వారు మతం మార్చుకున్నారా? లేక పేర్లు మార్చుకున్నారా? అనే కోణంలో దర్యాఫ్తు చేస్తున్నారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం ఆధారంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భోపాల్ లో 11 మందిని అరెస్ట్ చేసింది. హైదరాబాద్ లోను పలుచోట్ల సోదాలు నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేసింది.


More Telugu News