వీటిని నాన బెట్టుకునే తినాలి.. ఎందుకో తెలుసా?

  • కొన్ని రకాల పదార్థాల్లో యాంటీ న్యూట్రియంట్ మూలకాలు
  • చాలా వాటిల్లో ఫైటిక్ యాసిడ్
  • నానబెట్టడం వల్ల వీటిని తొలగించుకోవచ్చు
  • జీర్ణ పరమైన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు
కొన్ని రకాల ఆహార పదార్థాలను ముందుగా నీటిలో నానబెట్టుకుని తీసుకోవడం వల్ల వాటి ప్రయోజనాలు మనకు పూర్తిగా అందుతాయి. సులభంగా జీర్ణమవుతాయి. అందులోని పోషకాలు మన శరీరానికి చక్కగా అందుతాయి. వీటిల్లో యాంటీ న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు పోషకాలు మన శరీరానికి పట్టకుండా అడ్డుకుంటాయి. అందుకని వీటిని నానబెట్టడం వల్ల యాంటీ న్యూట్రియెంట్స్ చాలా వరకు పోతాయి. 

గసగసాలు: వీటిల్లో విటమిన్ బీ పుష్కలంగా ఉంటుంది. ఫొలేట్, థయమిన్ లభిస్తాయి. వీటిని ఎందుకు నానబెట్టి తీసుకోవాలంటే వీటి బయటి భాగం కఠినమైనది. అందుకని నాన బెట్టుకోవాలి.
బియ్యం: అన్నం వండడానికి ముందు బియ్యాన్ని నానబెట్టడం వల్ల గింజ సమాంతరంగా ఉడుకుతుంది. గింజలోని అదనపు గంజి నీటితో వెళుతుంది. అలాగే, ఓట్స్, క్వినోవా, మిల్లెట్స్ ను సైతం నానబెట్టుకుని తినాలి. 
బాదం: బాదం గింజలపై పొట్టు జీర్ణానికి కష్టమైనది. అందుకని నానబెట్టుకోవాలి. అంతేకాదు దీనివల్ల రుచి కూడా పెరుగుతుంది. బాదం గింజలనే కాకుండా జీడి పప్పు, సన్ ఫ్లవర్ సీడ్స్ ను సైతం నానబెట్టుకునే తీసుకోవాలి.
మామిడి: మామిడి పండ్లను నానబెట్టుకుని తింటే వేడి చేయదు. నేరుగా తినడం వల్ల వేడి కారణంగా మొటిమలు రావచ్చు. పైగా వీటిల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ వికారం కలిగిస్తుంది. 
కిస్ మిస్: వీటిని కనీసం ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుని తినాలి. బరువు తగ్గడానికి, జుట్టు రాలే సమస్య నివారణకు, నిద్రలేమి సమస్యకు ఇది మంచి ఫలితాలను ఇస్తుంది.
ఫ్లాక్స్ సీడ్స్: శరీరంలో చెడు, మంచి కొలెస్ట్రాల్ మధ్య సమతుల్యం కోసం నానబెట్టిన ఫ్లాక్స్ సీడ్స్ (అవిశె గింజలు)  తీసుకోవడం మంచిది. ఇందులో ఫైబర్ జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది.
యాప్రికాట్స్: ప్రూన్స్, యాప్రికాట్స్ శుభ్రంగా కడిగి, మంచి నీటిలో నానబెట్టుకోవాలి. దీనివల్ల సల్ఫేట్స్ తొలగిపోతాయి. 
రాజ్మ: రాజ్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది. కనుక రోజువారీ ఆహారంలో వీటికి చోటు ఉండాలి. కాకపోతే వీటిల్లో ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రిషనల్ మూలకం ఉంటుంది. నానబెట్టడం వల్ల ఇది చాలా వరకు తగ్గుతుంది. చిక్కుడు జాతికి చెందిన గింజలు అన్నింటినీ నానబెట్టుకునే తీసుకోవాలి. వీటిల్లోని ఫైటిక్ యాసిడ్ అనే యాంటీ న్యూట్రియంట్ జింక్, ఐరన్ ఖనిజాలకు అంటిపెట్టుకుని ఉండి, వాటిని మన శరీరం గ్రహించకుండా అడ్డుపడుతుంది. అందుకని నానబెట్టుకోవడమే మంచి మార్గం. 
శనగలు: శనగలను రాత్రంతా నానబెట్టిన తర్వాత తీసుకోవడం వల్ల అజీర్ణ సమస్య ఉండదు.


More Telugu News