పాకిస్థాన్‌ చేజారిన ఆసియా కప్ ఆతిథ్యం.. వేరే చోటికి తరలించాలని ఏసీసీ నిర్ణయం

  • పాకిస్థాన్ ‘తటస్థ’ ప్రతిపాదనను తిరస్కరించిన సభ్యదేశాలు
  • భారత్-పాక్‌లు ఒకే గ్రూపులో ఉంటే మూడో జట్టుకు ఇబ్బందులు తప్పవన్న ఏసీసీ
  • శ్రీలంకలో నిర్వహించాలని నిర్ణయం!
  • నేడు తుది ప్రకటన వెలువడే అవకాశం
అనుకున్నదే అయింది. ఆసియాకప్‌ ఆతిథ్యాన్ని పాకిస్థాన్ కోల్పోయింది. దీనిని వేరే చోటికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించింది. నిజానికి ఈ ఏడాది ఆసియాకప్‌ను పాకిస్థాన్ నిర్వహించాల్సి ఉంది. అయితే, భారత్-పాకిస్థాన్ మధ్య రాజకీయ పరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు తమ జట్టును పంపబోమని బీసీసీఐ తేల్చి చెప్పింది. దీంతో అప్పటి నుంచి ఆసియాకప్ నిర్వహణపై నీలి నీడలు కమ్ముకున్నాయి. 

భారత జట్టు పాకిస్థాన్ రాకుంటే తాము కూడా భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌కు రాబోమని పాకిస్థాన్ బెదిరించే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నాలు ఫలించకపోవడంతో తటస్థ దేశంలో భారత జట్టు తన మ్యాచ్‌లు ఆడే ప్రతిపాదన తీసుకొచ్చింది. భారత్ తన మ్యాచ్‌లను యూఏఈలో ఆడితే మిగతా మ్యాచ్‌లను పాకిస్థాన్ లో నిర్వహిస్తామని ‘హైబ్రిడ్ మోడల్‌’ పీసీబీ ప్రతిపాదించింది. 

అయితే, దీనికి సభ్య దేశాల నుంచి మద్దతు కరవవడంతో ఆసియాకప్‌ను వేరే దేశానికి తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. పాకిస్థాన్ ప్రతిపాదించిన ‘తటస్థ దేశం’ ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని, ఒకవేళ భారత్, పాకిస్థాన్ దేశాలు ఒకే గ్రూపులో ఉంటే అప్పుడు మూడో జట్టు అటు పాకిస్థాన్, ఇటు యూఏఈకి చక్కర్లు కొట్టాల్సి వస్తుందని ఏసీసీ అభిప్రాయపడింది. 

ఈ నేపథ్యంలో ఆసియాకప్‌ను వేరే దేశానికి తరలించాలని నిర్ణయించింది. దీంతో ఆసియాకప్‌ను ఇప్పుడు శ్రీలంకలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, నేడు జరిగే రెండో విడత చర్చల్లో ఏసీసీ తన మనసు మార్చుకుంటుందేమోనని పాక్ బోర్డు ఆశగా ఉంది.


More Telugu News