తమిళనాడు ‘ప్లస్ టు’ ఫలితాల్లో ‘టాప్’ లేపిన బాలిక.. 600కు 600 మార్కులు!

  • నిన్న విడుదలైన ‘ప్లస్ టు’ ఫలితాలు
  • 600 మార్కులు సాధించి ‘టాపర్’గా నిలిచిన దిండిగల్లు అమ్మాయి నందిని
  • ప్లస్ టు ఫలితాల్లో 94.03 శాతం ఉత్తీర్ణత
  • అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతమే ఎక్కువ
తమిళనాడులో నిన్న విడుదలైన ప్లస్ టు (ఇంటర్ సెకండియర్) ఫలితాల్లో ఓ అమ్మాయి ‘టాప్’ లేపింది. 600కు 600 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. దిండిగల్లు పట్టణంలోని అన్నామలైయార్ బాలికల మహోన్నత పాఠశాలలో చదివిన నందిని 100 శాతం మార్కులు సాధించి సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా నందిని ఓ టీవీ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. తాను ఆడిటర్ కావాలనుకుంటున్నట్టు చెప్పింది.

తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ (టీఎన్ డీజీఈ) ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 8 లక్షలమందికిపైగా విద్యార్థులు 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 7,55,451 మంది (94.03 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత శాతమే ఎక్కువ.

పరీక్షలకు హాజరైన అమ్మాయిల్లో 96.38 శాతం మంది పాస్ కాగా, 91.45 శాతం మంది అబ్బాయిలు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. తమిళం, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్‌లో ఎక్కువమంది విద్యార్థులు వందకు 100 మార్కులు సాధించడం గమనార్హం.


More Telugu News