ఆర్సీబీ కెప్టెన్ గా ధోనీ ఉండుంటే.. వాసీమ్ అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఆర్సీబీ
  • బెంగళూరు కెప్టెన్ గా ధోనీ ఉండుంటే 3 ట్రోఫీలు గెలిచేదన్న వాసీమ్ అక్రమ్
  • తన జట్టు ఆటగాళ్లలో విశ్వాసాన్ని ఎలా నింపాలో ధోనీకి తెలుసని వ్యాఖ్య
ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి లీగ్ లో కొనసాగుతూ.. ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవని జట్లు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్. బెంగళూరు మూడు సార్లు ఫైనల్స్ దాకా వెళ్లినా.. ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ లెజండరీ బౌలర్, మాజీ కెప్టెన్ వాసీమ్ అక్రమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధోనీ కనుక ఆర్సీబీ కెప్టెన్ గా ఉండుంటే.. ఆ టీమ్ మూడు టైటిల్స్ ను గెలిచేదని చెప్పారు.

ఓ స్పోర్ట్స్ వెబ్ సైట్ తో వాసీమ్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటిదాకా ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. వాళ్లకు ఎంతో సపోర్ట్ ఉంది. ఆధునిక క్రికెట్ లో గొప్ప ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా జట్టులో ఉన్నాడు. కానీ దురదృష్టవశాత్తు ట్రోఫీని దక్కించుకోలేకపోయారు. ఒకవేళ ఆర్సీబీలో ధోనీ ఉండుంటే.. ట్రోఫీ గెలుచుకోవడంలో సాయపడేవాడు. అతడు కెప్టెన్ గా ఉండుంటే.. ఆర్సీబీ మూడు టైటిల్స్ గెలిచేది’’ అని అభిప్రాయపడ్డాడు. 

ధోనీ కెప్టెన్సీ సామర్థ్యంపై అక్రమ్ ప్రశంసలు కురిపించారు. తన జట్టు ఆటగాళ్లలో విశ్వాసాన్ని ఎలా నింపాలో ధోనీకి తెలుసని అన్నారు. ‘‘జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే అలవాటు ధోనికి ఉంది. అతను లోలోపల ప్రశాంతంగా ఉండడు. కానీ బయటికి ప్రశాంతంగా కనిపిస్తాడు. తమ కెప్టెన్‌ కూల్ గా ఉండటాన్ని చూసినప్పుడు.. తమ భుజంపై చేయి వేసి కెప్టెన్ మాట్లాడినప్పుడు.. ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో ఆడతారు. తన తోటి ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడం ఎలానో తెలిసిన వ్యక్తి ధోనీ’’ అని వివరించారు.

2008లో మొదలైంది ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్). ముంబై ఇండియన్స్ టీమ్ అత్యధికంగా 5 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు, కోల్ కతా రెండు సార్లు, హైదరాబాద్ రెండు సార్లు (డెక్కన్ చార్జర్స్ ఒకసారి, సన్ రైజర్స్ ఒకసారి) రాజస్థాన్ ఒకసారి గెలుచుకున్నాయి. లీగ్ లోకి ప్రవేశించిన తొలి సీజన్ (2022) లోనే ట్రోఫీ గెలుచుకుంది గుజరాత్. కానీ టోర్నీ మొదటి నుంచి కొనసాగుతున్న పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఒక్కసారి కూడా టైటిల్ ను అందుకోలేదు.

ఇక ధోనీ నాలుగు ఐపీఎల్ టైటిల్స్ తోపాటు.. టీమిండియా కెప్టెన్ గా వన్డే వరల్డ్ కప్, టీ20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీని గెలిపించాడు. ఇక రోహిత్ శర్మ కూడా ముంబైకి 5 ట్రోఫీలు అందించాడు. ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్నాడు. ధోనీ తర్వాత, రోహిత్ కు ముందు టీమిండియా కెప్టెన్ గా ఉన్న కోహ్లీ ఒక్క మేజర్ ట్రోఫీని కూడా గెలుచుకోలేకపోయాడు. 2008 నుంచి ఆర్సీబీతోనే ఉన్నా, సుదీర్ఘ కాలం కెప్టెన్ గా ఉన్నా టైటిల్ ను అందించలేకపోయాడు.


More Telugu News