తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే..!

  • ఈ నెల 9న విడుదల చేయనున్న ఇంటర్ బోర్డు
  • ఆదివారం జరిగిన సమావేశంలో నిర్ణయించిన అధికారులు
  • ఉదయం 11 గంటలకు బోర్డు కార్యాలయంలో ఫలితాల విడుదల
తెలంగాణలో ఇంటర్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు శుభవార్త.. ఫస్టియర్ తో పాటు సెకండియర్ ఫలితాలను ఈ నెల 9 (మంగళవారం) న విడుదల చేసేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఇందుకోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం. వచ్చేవారంలో ఫలితాలు విడుదల చేస్తారని ప్రచారం జరిగినా.. ఇప్పటికే ఆలస్యం కావడంతో మంగళవారమే రిజల్ట్స్ ప్రకటించాలని అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇంటర్ ఫలితాల వెల్లడిపై ఆదివారం బోర్డు అధికారులు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఫలితాల విడుదలపై చర్చించారు. అనంతరం మంగళవారం నాడు ఫలితాలు ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్లు అనధికారిక వర్గాల సమాచారం. విద్యార్థులు బోర్డ్ వెబ్ సైట్ ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా, ఇంటర్ పరీక్షల జవాబు పత్రాలను ఈసారి ఆన్ లైన్ మూల్యాంకనం చేపట్టాలని బోర్డు తొలుత నిర్ణయించింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాకపోవడంతో ఆఫ్ లైన్ లోనే మూల్యాంకనం పూర్తిచేసింది.

రాష్ట్రంలో ఈ ఏడాది మార్చిలో ఇంటర్ పరీక్షలు జరగగా 4.83 లక్షల మంది విద్యార్థులు ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాశారు. సెకండ్ ఇయర్ పరీక్షలకు 4.24 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఫలితాల విషయంలో ఎలాంటి టెక్నికల్ సమస్య ఎదురవకూడదనే ఉద్దేశంతో ఒకటికి రెండు మార్లు ట్రయల్స్ నిర్వహించారు.


More Telugu News