కేరళ బోటు ప్రమాదం.. ఒకే కుటుంబంలోని 11 మంది మృతి

  • 22కు పెరిగిన మరణాల సంఖ్య, కొనసాగుతున్న రెస్క్యూ
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో ఆరుగురు
  • చాలామంది లైఫ్ జాకెట్లు ధరించలేదని వెల్లడించిన బాధితులు 
కేరళ బోటు ప్రమాదంలో చనిపోయిన వారి సంఖ్య 22 కు పెరిగింది. మృతుల్లో ముగ్గురు చిన్నారులు సహా పదిహేను మంది మహిళలు ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో హౌస్ బోట్ లో మొత్తం 30 మంది టూరిస్టులు ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో రెస్క్యూ పనులు ఇంకా కొనసాగిస్తున్నట్లు కేరళ క్రీడా, మత్స్య శాఖ మంత్రి వి అబ్దురాహిమన్ తెలిపారు. హౌస్ బోటు బోల్తా పడిన చోట గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు.

మలప్పురం జిల్లా తనూర్ లో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది చనిపోయారని స్థానిక మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది. స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో విహారయాత్రకు వచ్చి ఈ ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకున్నారని తెలిపింది. కాగా, హౌస్ బోటులో ప్రయాణం సందర్భంగా చాలా మంది లైఫ్ జాకెట్లు ధరించలేదని బాధితులు చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఆరుగురు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని మంత్రి అబ్దురాహిమన్ చెప్పారు.


More Telugu News