భారత్‌లో 5జీ ఫోన్లకు భారీ డిమాండ్.. తెగ కొనేస్తున్న జనాలు!

  • జనవరి-మార్చి త్రైమాసికంలో స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్లలో 5జీ ఫోన్ల వాటా 45 శాతం
  • చౌక ధర 5జీ ఫోన్లకే డిమాండ్ అధికం
  • మార్కెట్ రీసెర్చ్ సంస్థ ఐడీసీ అధ్యయనంలో వెల్లడి
భారత్‌లో 5జీ ఫోన్లకు గిరాకీ భాగా ఉన్నట్టు మార్కెట్ పరిశోధన సంస్థ ఐడీసీ తాజాగా తేల్చింది. జనవరి-మార్చి త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ల షిప్‌మెంట్లలో 5జీ ఫోన్ల వాటా 45 శాతానికి పెరిగినట్టు సంస్థ అధ్యయనంలో తేలింది. 5జీ ఫోన్లలో చౌక ధరల ఫోన్లకే మంచి డిమాండ్ ఉన్నట్టు సంస్థ పేర్కొంది. 

అయితే, మార్చితో ముగిసిన త్రైమాసికంలో మొత్తం స్మార్ట్ ఫోన్ షిప్‌మెంట్ల సంఖ్య 16 శాతం తగ్గి 3.1 కోట్లుగా నమోదైంది. గత నాలుగేళ్లలో ఇంత తక్కువ సంఖ్యలో షిప్‌మెంట్లు ఉండటం ఇదే తొలిసారని పేర్కొంది. రియల్‌మీ, షావొమీ ఫోన్లు సంఖ్యలో అధిక క్షీణత కనిపించింది. ఈ త్రైమాసికంలో శామ్‌సంగ్ మార్కెట్ లీడర్‌గా నిలిచింది. మొత్తం షిప్‌మెంట్లలో 20.1 శాతం వాటాతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. 17.7 శాతం వాటాతో వివో రెండో స్థానంలో, 17.6 శాతం వాటాతో ఒప్పో మూడో స్థానంలో ఉన్నాయి. 

ఆర్థికంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వినియోగదారుల నుంచి డిమాండ్ తక్కువగా ఉందని ఐడీసీ వెల్లడించింది. 2022 ద్వితీయార్థంలో పండగ సీజన్‌కు ముందు రిటైలర్లు తమ స్టాక్ పెంచుకోవడంతో ప్రస్తుతం వారి వద్ద స్మార్ట్ ఫోన్ నిల్వలు అధికంగా ఉన్నట్టు వెల్లడించింది.


More Telugu News