మణిపూర్ నుంచి విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం: మంత్రి బొత్స

  • భగ్గుమంటున్న మణిపూర్
  • గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఎస్టీ హోదా చిచ్చు
  • తీవ్రస్థాయిలో హింస
  • ఇంఫాల్ ఎన్ఐటీలో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులు
  • విమానం ఏర్పాటు చేశామన్న బొత్స
హింసాత్మక ఘటనలతో భగ్గుమంటున్న మణిపూర్ లో 150 మంది వరకు ఏపీ విద్యార్థులు చిక్కుకుపోవడం తెలిసిందే. వారంతా ఇంఫాల్ లోని ఎన్ఐటీలో విద్యాభ్యాసం చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా మణిపూర్ లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య ఎస్టీ హోదా వివాదం నెలకొనడంతో, తీవ్రస్థాయిలో ఘర్షణలు జరుగుతున్నాయి. దాంతో తెలుగు విద్యార్థులు బయటికి వచ్చే వీల్లేక తమ హాస్టళ్లలోనే కాలం గడుపుతున్నారు. 

ఈ పరిస్థితిపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. మణిపూర్ లో ఉన్న ఏపీ విద్యార్థులతో మాట్లాడుతున్నామని తెలిపారు. మణిపూర్ లో ఉన్న ఏపీ విద్యార్థుల జాబితా తయారు చేశామని వెల్లడించారు. విమానయాన మంత్రితో మాట్లాడి, విద్యార్థులను రాష్ట్రానికి తిరిగి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 

ఏపీ విద్యార్థుల కోసం హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశామని మంత్రి బొత్స తెలిపారు. వివరాలు నమోదు చేసుకున్న విద్యార్థులను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. ఇప్పటివరకు 100 మంది విద్యార్థులు తమ వివరాలు నమోదు చేసుకున్నారని బొత్స వెల్లడించారు. మరో 50 మంది ఏపీ విద్యార్థులు ఉండొచ్చని అంచనా వేస్తున్నామని అన్నారు. 150 మందిని తీసుకువచ్చేందుకు విమానం ఏర్పాటు చేశామని తెలిపారు. 

మణిపూర్ నుంచి విద్యార్థుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ముగ్గురు ఐఏఎస్ లను నియమించామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్ (కాంటాక్ట్ నెం.88009 25668), ఏపీ భవన్ ఓఎస్డీ రవిశంకర్ (కాంటాక్ట్ నెం. 91871 99905) తరలింపు చర్యలు పర్యవేక్షిస్తారని వివరించారు.


More Telugu News