మల్లయోధుల కోసం మట్టి మనుషులు... రెజ్లర్లకు మద్దతుగా కదిలిన రైతులు!

  • రెజ్లర్ల నిరసనలకు సంఘీభావం ప్రకటించిన సంయుక్త కిసాన్ మోర్చా
  • బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్ తోపాటు ధర్నాలో కూర్చున్న రైతు నేత రాకేశ్ టికాయత్ 
  • రెజ్లర్లకు తమ పూర్తి మద్దతు ఉందని ప్రకటన 
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లకు రైతులు మద్దతు తెలిపారు. రెజ్లర్ల నిరసనలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎం) నేతలు సంఘీభావం ప్రకటించారు. 

ఆదివారం జంతర్ మంతర్ లోని దీక్షాస్థలికి తన మద్దతుదారులతో కలిసి రైతు నేత రాకేశ్ టికాయత్ చేరుకున్నారు. రెజ్లర్లకు మద్దతుగా ధర్నాలో కూర్చున్నారు. ఎస్ కేఎం నేతలు దర్శన్ పాల్, హానన్ మొల్లా తదితరులు కూడా నిరసనల్లో పాల్గొన్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం, బ్రిజ్ భూషణ్ దిష్టి బొమ్మలను దహనం చేస్తామని రైతు నేతలు ప్రకటించారు.

మరోవైపు రెజ్లర్లకు సంఘీభావంగా ఢిల్లీ తరలివస్తామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించడంతో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జంతర్ మంతర్, ఢిల్లీ సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించారు. బారికేడ్లు, ట్రక్కులను అడ్డుగా ఉంచారు. 
 
రెజ్లర్లకు మద్దతుగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. ఈనెల 11 నుంచి 18 దాకా అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా, తాలూకా కేంద్రాల్లో సభలు నిరసన ర్యాలీలు చేపడతామని వెల్లడించింది. 

‘‘రెజ్లర్లకు మా పూర్తి మద్దతు ఉంది. భవిష్యత్ కార్యాచరణపై మేం ఈ రోజు నిర్ణయం తీసుకుంటాం. ఎఫ్‌ఐఆర్ నమోదు కాగానే బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలి’’ అని రైతు నేత రాకేశ్ టికాయత్ డిమాండ్ చేశారు.

రైతులు భారీగా తరలివస్తుండటంతో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రెజ్లర్లకు మద్దతుగా భారీగా రైతులు వాహనాల్లో తరలివస్తున్నారు. పరిమిత సంఖ్యలోనే రైతులను అనుమతిస్తామని పోలీసులు చెబుతున్నారు. కానీ వందల సంఖ్యలో రైతులు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఇంకా వస్తున్నారు.  




More Telugu News