తెలంగాణకు భారీ వర్ష సూచన

  • మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు
  • గంటకు గరిష్ఠంగా 61 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
  • పలు ప్రాంతాల్లో పిడుగుపాటుకూ అవకాశం
  • హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటన
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 

హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణ్ పేట్, సంగారెడ్డి, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. గంటకు 41 నుంచి గరిష్ఠంగా 61 కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. అక్కడక్కడా పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. 

ఇక బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం ఏర్పడిందని, ఇది 8న అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ మరుసటి రోజున ఇది వాయుగుండంగా మారుతుందని చెప్పింది. వాయుగుండం ఉత్తరదిశగా పయనిస్తూ తీవ్రమైన తుఫానుగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.


More Telugu News