ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ!

  • ఇటీవల వైసీపీ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకున్న బాలినేని
  • తనపై పార్టీలోని వారే విమర్శలు చేస్తున్నారంటూ కంటతడి
  • ఇప్పుడు ఫ్లెక్సీల్లో కనిపించని జగన్ బొమ్మ
తన నియోజక వర్గంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెబుతూ మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇటీవల వైసీపీ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసి చర్చకు తెరలేపారు. పార్టీలోని కొందరు తనపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారని రెండు రోజుల క్రితం భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. తాను తప్పు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాలు విసిరి దుమారం రేపారు.

ఇక తాజా విషయానికి వస్తే.. ఒంగోలులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోమారు రాజకీయ చర్చకు కారణమయ్యాయి. వేసవి నేపథ్యంలో ఒంగోలు నగరపాలక కార్యాలయం, ప్రకాశం భవన్, మార్కెట్ సెంటర్, రిమ్స్ వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి వీటిని ప్రారంభించాల్సి ఉండగా వివిధ కారణాలతో వాయిదా పడింది. అయితే, ఆయా చలివేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ముుఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫొటోలు లేకపోవడంతో రాజకీయ చర్చకు తెరలేచింది. ఈ పరిణామాలు చూస్తుంటే జగన్‌తో, పార్టీతో ఆయనకు దూరం పెరిగినట్టుగా ఉందని చెబుతున్నారు.


More Telugu News