‘పది’ ఫలితాలతో మనస్తాపం.. నలుగురు ఆత్మహత్యాయత్నం.. ఇద్దరి మృతి

  • పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య
  • అనంతపురం జిల్లాలో యువకుడి ఆత్మహత్యాయత్నం
  • రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైనందుకు విషం తాగిన ధర్మవరం మండలం కుర్రాడు
ఆంధ్రప్రదేశ్‌లో నిన్న విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు, ఉత్తీర్ణత కాలేదని మరికొందరు ఆత్మహత్యకు యత్నించారు. వీరిలో ఇద్దరు అమ్మాయిలు మృత్యువాత పడ్డారు. మిగతా ఇద్దరు చికిత్స పొందుతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా ఓబుళదేవరచెరువు మండలం నవాబుకోటకు చెందిన వలిపి సుహాసిని (15) పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైంది. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుంది. 

ధర్మవరం మండలం పోతులనాగేపల్లికి చెందిన దినేశ్ కుమార్ పదో తరగతిలో రెండు సబ్జెక్టుల్లో ఫెయిలయ్యాడు. దీంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన తల్లిదండ్రులు కుమారుడిని వెంటనే ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నాడు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామానికి చెందిన శివకుమార్ తాడిపత్రిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివాడు. నిన్నటి ఫలితాల్లో 434 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చాయన్న మనస్తాపంతో తోటకు వెళ్లాడు. 

ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానంతో వెళ్లిన తండ్రి గంగరాజుకు కుమారుడు అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం పోతులదొడ్డి గ్రామానికి చెందిన కామాక్షి (16) గణితంలో ఫెయిల్ కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News