పదో తరగతి పరీక్షల్లో దుమ్ము రేపిన ఆరో తరగతి బాలిక!

  • కాకినాడ బాలిక హేమశ్రీ ఘనత
  • బాలిక తెలివితేటల్ని పరీక్షించిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి
  • ‘పది’ విద్యార్థులతో కలిసి పరీక్ష రాసిన హేమశ్రీ
  • 488 మార్కులతో సత్తా చాటిన బాలిక 
అవును.. నిజమే! ఆంధ్రప్రదేశ్‌లో  నిన్న ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో ఆరో తరగతి విద్యార్థిని సత్తా చాటింది. 488 మార్కులు సాధించి శభాష్ అనిపించుకుంది. ఆ బాలిక పేరు ముప్పల హేమశ్రీ. కాకినాడ జిల్లా గాంధీనగర్ మహాత్మాగాంధీ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. ఆమె తల్లి మణి గృహిణి కాగా, తండ్రి సురేశ్ ప్రైవేటు ఉద్యోగి.

హేమశ్రీ చదువులో అసమాన ప్రతిభా పాటవాలు చూపిస్తుండడంతో ఉపాధ్యాయులు  ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో మార్చి 27న విజయవాడ సచివాలయంలో హేమశ్రీ తెలివితేటల్ని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ పరీక్షించారు. ఆమె ప్రతిభకు మెచ్చిన ఆయన పదో తరగతి పరీక్షలు రాసేందుకు అనుమతినిచ్చారు. దీంతో ఆమె పదో తరగతి విద్యార్థులతో కలిసి ‘పది’ పరీక్షలు రాసింది. నిన్న ప్రకటించిన ఫలితాల్లో హేమశ్రీ 488 మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంది.


More Telugu News