హైదరాబాదులో పలు ప్రాంతాల్లో వర్షం

  • తెలంగాణలో ఇవాళ కూడా వర్షాలు
  • హెచ్చరికలు జారీ చేసిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
  • భారీ గాలులతో మోస్తరు వర్షాలు పడే అవకాశం
తెలంగాణకు అకాల వర్షాల బెడద తొలగిపోయేలా లేదు. రాష్ట్రంలో మరి కొన్ని గంటల్లో పలు జిల్లాల్లో భారీ గాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. 

కూకట్ పల్లి, చందానగర్, శేరిలింగంపల్లి, కేపీహెచ్ బీ, గాగిల్లాపూర్, మదీనాగూడ, మల్లంపేట్, నిజాంపేట్, గండిమైసమ్మ, కొండాపూర్, హైదర్ నగర్, మియాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. 

కాగా, ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రాగల 48 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తుపానుగా మారే అవకాశాలున్నాయని తెలిపింది.


More Telugu News