చెన్నైపై ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా?

  • రెండు జట్ల మధ్య లీగ్ దశలో నేడు రెండో సమరం
  • ముంబై గెలుస్తుందంటున్న మాజీ క్రికెటర్ ఎస్.బద్రీనాథ్
  • ముంబై గెలుపు అంత ఈజీ కాదంటున్న మహమ్మద్ కైఫ్
  • చెన్నై జట్టుకు బలం, బలహీనత బౌలింగే
ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా.. అత్యధిక కప్పులు ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య నేడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆసక్తికర సమరం సాగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ఉంటుంది. లీగ్ దశలో రెండు జట్ల మధ్య ఇది రెండో పోరు. మార్చి 12న ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో చెన్నై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు 158 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, చెన్నై జట్టు 18.1 ఓవర్లకే దానిని సాధించింది. 

కానీ, నేటి పోరులో ముంబై ఇండియన్స్ ప్రతీకారం తీర్చుకుంటుందని టీమిండియా మాజీ క్రికెటర్ ఎస్.బద్రీనాథ్ అంచనా వేస్తున్నారు. దీనికి కారణం ముంబై జట్టు ఫైర్ పవర్ అని ఆయన అభిప్రాయం. స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ.. ‘‘సీఎస్కే ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ చూడ్డానికి అనుభవలేమితో ఉంది. ఇదే ఆందోళనకరం. వారి బౌలర్లు ఇంకా మెరుగుపడాలి. తనకున్న వనరులను ఎంఎస్ ధోనీ చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. కాకపోతే ముంబై ఇండియన్స్ ఫైర్ పవర్ చెన్నైను నిలువరిస్తుంది. అలాగే చెన్నై తన సొంత మైదానంలో ముంబైని ఎదుర్కోలేదు’’ అని బద్రీనాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

ఆరంభ మ్యాచులతో పోలిస్తే ముంబై జట్టు బలపడిందనడం నిజమే. గత కొన్ని మ్యాచుల్లో వరుస గెలుపులు ఇదే విషయాన్ని తెలియజేస్తాయి. భారీ స్కోరును సైతం ముంబై ఇండియన్స్ ఛేదించగలుగుతోంది. అయితే, రెండు జట్ల మధ్య నాణ్యమైన పోరు ఉంటుందని మహమ్మద్ కైఫ్ అన్నాడు. ఒక జట్టులో మెరుగైన బ్యాట్స్ మెన్ ఉంటే, మరో జట్టులో మెరుగైన స్పిన్నర్లున్నట్టు చెప్పాడు. సీఎస్కేని ఓడించడం ముంబైకి అంత సులభం కాదన్నాడు. ‘‘సీఎస్కే స్పిన్ త్రయం చాలా బలమైనది. కనుక సీఎస్కేని ఓడించాలంటే రోహిత్ సేన కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాల్సిందే’’ అని కైఫ్ పేర్కొన్నాడు.


More Telugu News