కాసేపట్లో బ్రిటన్ రాజు పట్టాభిషేకం.. వేడుకకు హాజరవుతున్న భారత ప్రముఖులు వీరే!

  • బ్రిటన్ రాజు పట్టాభిషేకానికి విచ్చేసిన 203 దేశాల ప్రతినిధులు
  • భారత ప్రభుత్వం తరపున హాజరైన ఉప రాష్ట్రపతి ధన్ కర్
  • సినీ నటి సోనమ్ కపూర్ కు ఆహ్వానం
బ్రిటన్ రాజుగా కింగ్ చార్లెస్-3 ఈరోజు పట్టాభిషిక్తులు కానున్నారు. లండన్ లోని వెస్ట్ మినిస్టర్ అబ్బేలో పట్టాభిషేక కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి 203 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరుకానున్నారు. వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు 12 వేల మంది పోలీసులు, 10 వేల మంది సైనికులను మోహరించారు. మరోవైపు మన దేశం నుంచి కూడా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరవుతున్నారు. 

 హాజరవుతున్న భారతీయ ప్రముఖులు:

ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్: భారత ప్రభుత్వం తరపున ధన్ కర్ అధికారికంగా హాజరవుతున్నారు. నిన్ననే ఈయన సతీసమేతంగా లండన్ చేరుకున్నారు. లండన్ లో ఉప రాష్ట్రపతికి ఘన స్వాగతం లభించింది. 

సినీ నటి సోనమ్ కపూర్: వేడుకల్లో భాగంగా కామన్వెల్త్ గాయక బృందం కార్యక్రమం ఉంటుంది. ఈ బృందానికి స్వాగతం పలుకుతూ సోనమ్ కపూర్ రెండు మాటలు మాట్లాడతారు. 

ముంబై డబ్బావాలాలు: ముంబైలో అత్యంత పేరుగాంచిన డబ్బావాలాల తరపున వారి ప్రతినిధి హాజరవుతున్నారు. ఈ సందర్భంగా రాజుకు వర్కారీ కమ్యూనిటీ తయారు చేసిన పునేరీ టర్బన్ తో పాటు శాలువా బహూకరిస్తారు. ముంబైలో లంచ్ బాక్సులు అందిస్తూ డబ్బావాలాలు ఎంతో సేవ చేస్తున్న సంగతి తెలిసిందే. 

సౌరభ్ పడ్కే: పూణెకు చెందిన 37 ఏళ్ల సౌరభ్ ఒక ఆర్కిటెక్ట్. చార్లెస్ ఫౌండేషన్, ప్రిన్స్ ఫౌండేషన్ స్కూల్ లో ఆయన చదువుకున్నారు. 

గుల్ఫ్ షా: 33 ఏళ్ల గుల్ఫ్ షా గత ఏడాది ప్రిన్స్ ట్రస్ట్ గ్లోబల్ అవార్డును అందుకున్నారు. ఈమె ఢిల్లీకి చెందినవారు. కన్స్ స్ట్రక్షన్ ప్రాజెక్టులకు ప్రైస్ ఎస్టిమేట్స్ అందించే కంపెనీలో పని చేస్తున్నారు. 

జై పటేల్: ఈయన కెనడాలో ఉంటారు. టొరంటోలోని ఐకానిక్ సీఎన్ టవర్ లో షెఫ్ గా పని చేస్తున్నారు. 'ప్రిన్స్ ట్రస్ట్ కెనడా' అందించే కెనడాస్ యూత్ ఎంప్లాయ్ మెంట్ ప్రోగ్రామ్ ను గత ఏడాది పూర్తి చేశారు.


More Telugu News