రాజస్థాన్ రాయల్స్ ను కుప్పకూల్చిన ఆఫ్ఘన్ స్పిన్ జోడీ

  • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
  • 17.5 ఓవర్లలో 118 ఆలౌట్
  • రషీద్ ఖాన్ కు 3, నూర్ అహ్మద్ కు 2 వికెట్లు
గుజరాత్ టైటాన్స్ తో సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ దారుణంగా బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ పూర్తి ఓవర్లు ఆడకుండానే కుప్పకూలింది. 17.5 ఓవర్లలో కేవలం 118 పరుగులకే ఆలౌట్ అయింది. 

రాజస్థాన్ రాయల్స్ పతనంలో గుజరాత్ టైటాన్స్ జట్టులోని ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ ద్వయం రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కీలకపాత్ర పోషించారు. రషీద్ ఖాన్ కేవలం 14 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, నూర్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి ధాటి చూస్తే, రాజస్థాన్ రాయల్స్ ఆడుతున్నది సొంతగడ్డపైనేనా అనే సందేహం కలిగింది. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ కొన్ని అద్భుతమైన బంతులతో రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్ మెన్ ను దిగ్భ్రాంతికి గురిచేశారు. 

మరోవైపు మహ్మద్ షమీ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, జాషువా లిటిల్ 1 వికెట్ తీసి రాజస్థాన్ ను కుప్పకూల్చడంలో తమ వంతు సహకారం అందించారు. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన 30 పరుగులే అత్యధికం. డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 14, దేవదత్ పడిక్కల్ 12 పరుగులు సాధించారు. 

జోస్ బట్లర్ (8) మరోసారి నిరాశపరిచాడు. హెట్మెయర్ (7), రియాన్ పరాగ్ (4), ధ్రువ్ జోరెల్ (9), అశ్విన్ (2) పేలవంగా ఆడారు. ఆఖర్లో ట్రెంట్ బౌల్ట్ (15) ఓ సిక్స్, ఓ ఫోర్ బాదడంతో రాజస్థాన్ కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది.


More Telugu News