భోజనంలో 30 శాతం మిల్లెట్స్.. కేంద్ర సాయుధ బలగాలకు అమలు
- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నిర్ణయం
- సంప్రదాయ ధాన్యాలతో పోలిస్తే వీటిల్లో పోషకాలు ఎక్కువ
- ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం
ఈ ఏడాది అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరం. భారత్ చొరవతో ఐక్యరాజ్యసమితి ఈ మేరకు లోగడ అధికారికంగా ప్రకటించింది. మిల్లెట్స్ కు మద్దతుగా కేంద్ర హోం శాఖ తాజాగా ఓ నిర్ణయం తీసుకుంది. కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు (సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్, బీఎస్ఎఫ్ఎఫ్, ఆర్ఏఎఫ్ తదితర), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)కు ఇచ్చే ఆహారంలో 30 శాతం మేర మిల్లెట్స్ ను చేర్చనున్నారు. కేంద్ర సాయుధ బలగాలతో చర్చించిన అనంతరం కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు.
మిల్లెట్స్ ను సిరిధాన్యాలుగా, చిరు ధాన్యాలుగా పిలుస్తుంటారు. సంప్రదాయ ధాన్యాలైన బియ్యం, గోధుమలతో పోలిస్తే వీటిల్లో ఫైబర్, పోషకాలు ఎక్కువ. అంతేకాదు కరవు పరిస్థితులను సైతం తట్టుకుని, అంతగా సారవంతం కాని భూముల్లో సైతం చిరు ధాన్యాల పంటలు పండుతాయి. కనుక పెరిగే జనాభా ఆహార అవసరాలను తీర్చడంలో ఇవి ముఖ్యపాత్ర పోషించనున్నాయి. మిల్లెట్స్ లో ఎన్నో రకాలు ఉన్నాయి. పెర్ల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్, ఫాక్స టైల్ మిల్లెట్, ప్రోసో మిల్లెట్, బర్న్ యార్డ్ మిల్లెట్ ముఖ్యమైనవి.