చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్న కస్టమర్‌.. షాపు నిర్వాహకుడి దాడి!

  • హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో షాకింగ్ ఘటన
  • తింటే తిను లేకపోతే వెళ్లిపో అంటూ షాపు నిర్వాహకుడి నిర్లక్ష్యపూరిత సమాధానం
  • కస్టమర్, షాపు నిర్వాహకుడి మధ్య తీవ్ర వాగ్వాదం
  • కత్తితో దాడి చేయబోయిన నిర్వాహకుడిని అడ్డుకున్న కస్టమర్ సోదరుడికి గాయం
  • బాధితుడికి ఆసుపత్రిలో చికిత్స, ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్న కస్టమర్‌పై షాపు నిర్వాహకుడు దాడికి దిగిన ఘటన హైదరాబాదు, కేపీహెచ్‌బీ కాలనీలో తాజాగా చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే నాగార్జున బుధవారం రాత్రి ఫేజ్-9లోని జేఎస్ పకోడీ సెంటర్‌కు వెళ్లి పకోడీ తిన్నాడు. అయితే, పకోడీలో కారం ఎక్కువైందంటూ షాపు నిర్వాహకుడు జీవన్‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో, తింటే తిను లేకపోతే వెళ్లిపో అంటూ జీవన్ నాగార్జునకు నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. 

అదే సమయంలో నాగార్జున సోదరుడు ప్రణీత్ అతడిని తీసుకెళ్లేందుకు అక్కడికి వచ్చాడు. అప్పటికే జీవన్, నాగార్జున మధ్య వివాదం ముదరడంతో జీవన్ నాగార్జునపై కత్తితో దాడి చేయబోయాడు. అతడిని అడ్డుకోబోయిన ప్రణీత్‌ మణికట్టు పై భాగంలో తీవ్ర గాయమైంది. దీంతో, స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News