తెలంగాణలో నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

  • గత రాత్రి హైదరాబాద్‌లో కుమ్మేసిన వాన
  • పలు జిల్లాల్లోనూ వర్షపాతం నమోదు
  • ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం
  • ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం
తెలంగాణలో వాతావరణం మళ్లీ మారిపోయింది. గత రాత్రి హైదరాబాద్ సహా మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎప్పట్లానే ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇక, నాగర్ కర్నూలు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, నిర్మల్, జగిత్యాల, వికారాబాద్, కుమురంభీం, ములుగు, మంచిర్యాల జిల్లాల్లో స్పల్ప వర్షపాతం నమోదైంది.

తెలంగాణలో నేడు కూడా పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో రేపు ఉపరితల ఆవర్తనం ఏర్పడి, దాని ప్రభావంతో ఎల్లుండి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

8న అది వాయుగుండంగా కేంద్రీకృతమవుతుందని, అనంతరం ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం వైపునకు కదులుతూ తుపానుగా బలపడే అవకాశం ఉందని వివరించింది. అది అల్పపీడనంగా మారిన తర్వాతే దాని తీవ్రత, ప్రయాణించే మార్గం తెలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


More Telugu News