​మహిళలకు మంచి రోజులు రావాలంటే 'ఫ్యాన్' వద్దమ్మా!: నారా లోకేశ్​

  • పాణ్యం నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర
  • మహిళలతో లోకేశ్ ముఖాముఖి
  • 'ఫ్యాన్' ఆరోగ్యానికి హానికరం అని వ్యాఖ్యలు
  • మహిళలను అందరూ గౌరవించేలా చేస్తామన్న లోకేశ్ 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 89వ రోజు పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గంలో దుమ్మురేపింది. పాదయాత్ర పొడవునా అడుగడుగునా మహిళలు నీరాజనాలు పడుతూ యువనేతకు ఆత్మీయ స్వాగతం పలికారు. రేమడూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైన పాదయాత్ర... పుసులూరు, బొల్లవరం, బస్తిపాడు, చినకొట్టాల మీదుగా పెదకొట్టాలకు చేరుకుంది. 

వాల్మీకి బోయలు, ఎస్సీలు, ఆయా గ్రామాల ప్రజలు యువనేతను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. బొల్లవరంలో మహిళలతో ముఖాముఖి సమావేశమై వారి సాధకబాధకలు విన్నారు. బొల్లవరం శివార్లలో కౌలురైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఏడాదిలో రాబోయే చంద్రన్న ప్రభుత్వం అందరి సమస్యలకు పరిష్కారం చూపుతుందని చెప్పి యువనేత ముందుకు సాగారు.

మహిళలతో లోకేశ్ ముఖాముఖి

టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణకు చట్టాలు మాత్రమే కాదు, మహిళల్ని గౌరవించడం చిన్నప్పటి నుండే నేర్పిస్తాం అని లోకేశ్ వెల్లడించారు. మహిళల గొప్పతనం, వారి కష్టం అందరికీ తెలిసేలా కేజీ నుండి పీజీ వరకూ ప్రత్యేక పాఠ్యాంశాలు తీసుకొస్తామని చెప్పారు. 

పాణ్యం నియోజకవర్గం బొల్లవరంలో మహిళలతో ముఖాముఖిలో లోకేశ్ మాట్లాడుతూ... 'ఫ్యాన్' ఆరోగ్యానికి హానికరం అని, 'ఫ్యాన్' ఆపేస్తే మహిళలకు మంచి రోజులు వస్తాయని అన్నారు. 

"దిశ చట్టం పెద్ద మోసం. అసలు చట్టమే లేకుండా స్టేషన్లు ప్రారంభించారు. వైసీపీ నాయకులే మహిళల్ని అసెంబ్లీ సాక్షి గా అవమానపరుస్తున్నారు. అందుకే మహిళల పై దాడులు విచ్చలవిడిగా జరుగుతున్నాయి" అని పేర్కొన్నారు.

నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తాం!

ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి అమ్మ ఒడి ఇస్తామని జగన్ మోసం చేశాడని లోకేశ్ విమర్శించారు. 45 ఏళ్లకే బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు పెన్షన్ ఇస్తామని జగన్ హామీ ఇచ్చాడని, ఇప్పుడు ఆ ఊసే లేదని తెలిపారు. 

"జగన్ పాలనలో నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు ఏపీలోనే ఉన్నాయి. విద్యుత్ ఛార్జీలు ఎనిమిదిసార్లు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు మూడు సార్లు పెంచారు, ఇంటి పన్ను పెంచారు, చెత్త పన్ను వేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించి ధరలు తగ్గేలా చేస్తాం. నిత్యావసర సరుకుల ధరలు, పన్నుల భారం తగ్గిస్తాం" అని భరోసా ఇచ్చారు.

మహిళల స్వయం ఉపాధికి కార్యాచరణ

డ్వాక్రా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని లోకేశ్ మండిపడ్డారు. వడ్డీ లేని రుణాలు ఇస్తాం అని మోసం చేశారని, ఆఖరికి మీరు దాచుకున్న అభయహస్తం డబ్బులు రూ.2500 కోట్లు కూడా జగన్ ప్రభుత్వం కొట్టేసింది అని వెల్లడించారు. 

"మహిళల స్వయం ఉపాధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తాం. మంగళగిరి లో మహిళలకు టైలరింగ్ కోర్సులో శిక్షణ ఇచ్చి ఉచితంగా కుట్టు మిషన్లు ఇచ్చాం. అక్కడితో ఆగకుండా ఒక మార్కెట్ లింకేజ్ చేశాం. అన్ని రంగాల్లో మహిళల్ని ప్రోత్సహించే విధంగా ప్రోత్సహిస్తాం. సబ్సిడీ రుణాలు అందజేసి మహిళా పారిశ్రామిక వేత్తలుగా మారేందుకు సహకరిస్తాం" అని హామీ ఇచ్చారు.

విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారు!

విద్యా వ్యవస్థను జగన్ నిర్వీర్యం చేశారని లోకేశ్ విమర్శించారు. విద్యా దీవెన, వసతి దీవెన పథకాలు ఫెయిల్ అయ్యాయని అన్నారు. "టీడీపీ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకంలో భాగంగా ఫీజులు నేరుగా కాలేజీలకు చెల్లించాం. జగన్ పాలనలో ఫీజులు నేరుగా తల్లుల ఖాతాలో వేస్తామని చెప్పి చెల్లించడం లేదు. 

విద్యా దీవెన, వసతి దీవెన వలన తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కాలేజీలకు బకాయి పడ్డ ఫీజులు అన్ని సింగిల్ సెటిల్మెంట్ చేసి విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇప్పిస్తాం" అని స్పష్టం చేశారు. 

మద్య నిషేధంపై మడమ తిప్పాడు!

జగన్ సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానని మోసం చేశాడని ఆరోపించారు. మద్యపాన నిషేధం తరువాతే ఓట్లు అడుగుతా అన్నాడని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాడు అంటూ మండిపడ్డారు. 

"మందుపై వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి రూ.25 వేల కోట్లు అప్పు తెచ్చాడు. జె-బ్రాండ్ లిక్కర్ తయారు చేసి మద్యాన్ని ఏరులై పారిస్తున్నాడు. జే బ్రాండ్ లిక్కర్ విషం కంటే ప్రమాదం. డబ్బు పిచ్చితో ప్రజల ప్రాణాలు తీస్తున్నాడు. ఆ మద్యం తాగితే పైకి పోవడం ఖాయం" అని స్పష్టం చేశారు.

పత్తిచేనును పరిశీలించిన లోకేశ్

పాణ్యం నియోజకవర్గం బొల్లవరం శివార్లలో పత్తిచేలోకి దిగిన లోకేశ్ అక్కడ మహిళారైతును కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతు మల్లేశ్వరి మాట్లాడుతూ... కష్టనష్టాలను లోకేశ్ కు వివరించింది. 

అందుకు లోకేశ్ బదులిస్తూ...  ఎన్నికల సమయంలో ఏదేదో చేస్తానని కల్లబొల్లి కబుర్లు చెబుతూ ముద్దులు పెట్టిన జగన్... ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడని విమర్శించారు. వైసీపీ నేతల కనుసన్నల్లోనే కల్తీ విత్తనాల మాఫియా నడుస్తోందని లోకేశ్ ఆరోపించారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విత్తనాల మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం అని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఒక్క సంవత్సరం ఓపిక పట్టండి... రాబోయే చంద్రన్న ప్రభుత్వం రైతులు, కౌలురైతులకు అండగా నిలస్తుంది అని పేర్కొన్నారు.

అరక దున్నుతూ రైతన్న కష్టాలు తెలుసుకున్న టీడీపీ యువనేత 

బొల్లవరం శివారులో చంటిబిడ్డను కాడి మధ్య ఉయ్యాలలో వేసి, సేద్యం చేస్తున్న రైతును లోకేశ్ కలిశారు. ఈ సందర్భంగా లోకేశ్ అరక దున్నుతూ రైతన్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు. రైతు మౌలాలి మాట్లాడుతూ... కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది... మీరు అధికారంలోకి వచ్చాక మాలాంటి వారిని ఆదుకోండి అని కోరారు. 

అందుకు లోకేశ్ స్పందిస్తూ... రాష్ట్రంలో వ్యవసాయంపై అవగాహనలేని ముఖ్యమంత్రి కారణంగా రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోతే కనీసం పొలాలను పరిశీలించే నాథుడు లేడని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కౌలు రైతులను ఆదుకునేందుకు ప్రత్యేక చట్టం తెస్తాం అని స్పష్టం చేశారు. పంట పెట్టుబడులను తగ్గించి వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని చెప్పారు. 

"రైతులకు రాయితీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందజేస్తాం. పాత క్రాప్ ఇన్సూరెన్స్ విధానాన్ని పునరుద్ధరించి, పంటలు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకుంటాం" అని హామీ ఇచ్చారు.

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం – 1147.5 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం – 11.9 కి.మీ.*

*90వరోజు (5-5-2023) యువగళం వివరాలు:*

*పాణ్యం అసెంబ్లీ నియోజక వర్గం (నంద్యాల జిల్లా):*

ఉదయం

7.00 - పెద్దకొట్టాల నుంచి పాదయాత్ర ప్రారంభం.

7.15 – కె.మార్కాపురంలో రైతులతో సమావేశం.

7.40 – కె.మార్కాపురం బస్టాండు వద్ద స్థానికులతో సమావేశం.

8.35 – కె.మార్కాపురం కర్నూలు రోడ్డు హైవేలో కురుబలతో భేటీ.

9.00 – ఎ.గోకులపాడు క్రాస్ వద్ద రైతులతో సమావేశం.

9.40 – సల్కాపురంలో యువతతో భేటీ.

10.20 – నీరవాడలో స్థానికులతో సమావేశం.

11.15 – పెదపాడులో స్థానికులతో భేటీ.

11.40 – పెదపాడులో భోజన విరామం.

సాయంత్రం

5.00 – పెదపాడు బహిరంగసభలో లోకేష్ ప్రసంగం.

6.45 – పెదపాడు రేడియో స్టేషన్ వద్ద విడిది కేంద్రంలో బస.

******








More Telugu News