మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు.. 'ఇదంతా అపార్థాలు వల్లే' అంటున్న ముఖ్యమంత్రి

  • నాగా, కుకి ట్రైబల్స్ మధ్య హింసాత్మక వాతావరణం
  • నియంత్రించలేని పరిస్థితి కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్ ఉత్తర్వులు
  • హింసాత్మక ఘటనల నియంత్రణకు భారీగా పోలీసుల మోహరింపు
  • సీఎంతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించిన అమిత్ షా
మణిపూర్ అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హింసాత్మక ఘటనలను అదుపు చేసేందుకు తీవ్రమైన కేసుల్లో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశిస్తూ గవర్నర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని, ఒకవేళ నియంత్రించలేని పరిస్థితులు ఉంటే కాల్పులకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ తరఫున జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. హింసాత్మక ఘటనలను నియంత్రించేందుకు 55 కంపెనీలతో కూడిన ఆర్మీ, అసోం రైఫిల్స్ ను మోహరించారు. మరో 14 బృందాలను సిద్ధంగా ఉంచారు. హింసకు తావున్న పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు.

మణిపూర్ లో మెజార్టీ మెయిటీ కమ్యూనిటీ, ట్రైబల్స్ మధ్య అల్లర్లు చెలరేగాయి. నాగా, కుకి ట్రైబల్స్ మధ్య హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 9000 మందికి పైగా నిరాశ్రయులయ్యారు. శాంతిభద్రతలకు సహకరించాలని సీఎం బీరెన్ సింగ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని, సున్నిత ప్రాంతాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించామని చెప్పారు. రాష్ట్రంలో సామరస్యతకు భంగం కలిగించవద్దని విజ్ఞప్తి చేశారు. ఇరువర్గాల మధ్య అపార్థం, కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా ఈ ఘటన చోటు చేసుకుందని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం మణిపూర్ సీఎంతో మాట్లాడి, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించారు.


More Telugu News