గవర్నర్‌ను పిలవాలని రాజ్యాంగంలో ఉందా?: హరీశ్ రావు కౌంటర్

  • సచివాలయ ప్రారంభోత్సవానికి తనను పిలవలేదన్న గవర్నర్‌కు మంత్రి కౌంటర్
  • వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభానికి రాష్ట్రపతిని పిలిచారా?
  • తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం బాధాకరమన్న హరీశ్ 
తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను ఆహ్వానించాలని రాజ్యాంగంలో ఏమైనా ఉందా? అని రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆయన హైదరాబాద్ లో మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. తనను సచివాలయ ప్రారంభోత్సవానికి పిలవలేదని గవర్నర్ తమిళసై చేసిన వ్యాఖ్యలపై ఈ సందర్భంగా ఆయన స్పందించారు. గవర్నర్ ను ఆహ్వానించాలని రాజ్యాంగంలో ఉందా అన్నారు. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభించినప్పుడు రాష్ట్రపతిని పిలిచారా, వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఎన్నిసార్లు ప్రారంభిస్తారని ప్రశ్నించామా అని నిలదీశారు. గవర్నర్ గా, మహిళగా తమిళసైని గౌరవిస్తామని, కానీ తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగేలా వ్యవహరించడం బాధిస్తోందన్నారు.

బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో తమిళసై మాట్లాడుతూ... భారత్ కు వచ్చే దేశాధినేతలను కూడా కలుసుకునే అవకాశం ఉంటుందని, తెలంగాణలో సీఎంను కలిసే అవకాశం మాత్రం ఉండదని, ఇది దురదృష్టకరమన్నారు. కొన్ని దేశాలు దగ్గర కావొచ్చు కానీ తెలంగాణలో రాజ్ భవన్, ప్రగతి భవన్ దగ్గర కావన్నారు. ఇటీవల సచివాలయం ప్రారంభించినప్పుడు రాష్ట్ర ప్రథమ పౌరురాలికి మాత్రం ఆహ్వానం లేదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, మంత్రి అయినా, గవర్నర్ అయినా ఓపెన్ మైండ్ తో ఉండాలన్నారు.


More Telugu News