పల్నాడు జిల్లా దుర్గి మండలంలో పెద్ద పులి సంచారం

  • ఏప్రిల్ 26న ఆవుపై దాడి చేసిన పులి
  • భయాందోళనల్లో గజాపురం గ్రామస్తులు
  • గజాపురం గ్రామాన్ని సందర్శించిన అటవీశాఖ అధికారి రామచంద్రరావు
  • కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలు పరిశీలిస్తున్నట్టు వెల్లడి
పల్నాడు జిల్లా దుర్గి మండలంలో పెద్ద పులి కలకలం రేగింది. గజాపురం గ్రామం వద్ద ఓ ఆవుపై పెద్ద పులి దాడి చేసినట్టు గుర్తించారు. పెద్ద పులి సంచారంతో ఈ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, అటవీశాఖ అధికారి రామచంద్రరావు గజాపురం గ్రామాన్ని, పరిసరాలను సందర్శించారు. ఏప్రిల్ 26న గజాపురం వద్ద ఆవుపై పులి దాడి చేసిందని వెల్లడించారు. 

సాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ లో 75 వరకు పులులు సంచరిస్తున్నాయని తెలిపారు. లోయపల్లి, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, బొల్లాపల్లిలోనూ పులి సంచరిస్తున్నట్టు తెలిసిందని వివరించారు. ప్రతి పులి 25 నుంచి 50 కిలోమీటర్ల పరిధిలో సంచరిస్తుంటుందని అటవీశాఖ అధికారి రామచంద్రరావు వెల్లడించారు. 

పులి సంచరించే ప్రాంతాల్లో పొలాలకు విద్యుత్ కంచెలు వేయడం నేరం అని స్పష్టం చేశారు. కాగా, దుర్గి మండలంలో కెమెరాలు ఏర్పాటు చేసి పులి కదలికలు గుర్తిస్తున్నామని తెలిపారు.


More Telugu News