అత్యుత్సాహంతో చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్

  • ఎన్నికల్లో తన విజయానికి దొంగ ఓట్లు దోహదపడ్డాయన్న రాపాక
  • రాపాక వ్యాఖ్యల వీడియో వైరల్ అయిన వైనం
  • ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వెంకటపతిరాజు అనే వ్యక్తి
  • సమగ్ర నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
  • వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని కోనసీమ కలెక్టర్ కు ఆదేశం
ఎన్నికల్లో తన విజయానికి దొంగ ఓట్లు కూడా దోహదపడ్డాయని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు ఇటీవల ఓ వీడియో వైరల్ అయింది. 

తమ ఊరు చింతలమోరికి ఓ దొంగ ఓట్ల బ్యాచ్ వచ్చేదని, 15 నుంచి 20 మంది వరకు తలా 5 నుంచి 10 ఓట్లు వేసేవారని, తన విజయంలో దొంగ ఓట్ల పాత్ర కూడా ఉందని రాపాక ఆ వీడియోలో చెప్పడం అందరూ చూశారు. ఇప్పుడా వీడియోలో చేసిన వ్యాఖ్యలు రాపాక మెడకు చుట్టుకున్నాయి. 

దొంగ ఓట్లతో గెలిచానని బహిరంగంగా ప్రకటించిన వీడియోపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సమగ్ర నివేదిక కోరారు. వారం రోజుల్లో నివేదిక అందించాలని కోనసీమ కలెక్టర్ ను ఆదేశించారు. 

రాజోలుకు చెందిన వెంకటపతిరాజు అనే వ్యక్తి ఫిర్యాదుపై ఎన్నికల ప్రధాన అధికారి పైవిధంగా స్పందించారు. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు తన వ్యాఖ్యల ద్వారా అంగీకరించారని వెంకటపతిరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు.


More Telugu News