కోహ్లీ, గంభీర్ పై జరిమానా.. అయినా ఎందుకు లెక్క చేయరో తెలుసా?

  • జరిమానాలను వారు తమ జేబుల నుంచి చెల్లించరు
  • వారి తరఫున చెల్లింపులు చేస్తున్న ఫ్రాంచైజీలు
  • ఈ చర్యలు చాలవంటున్న నెటిజన్లు
ఇటీవలే (మే 1న) యూపీ లక్నోలోని ఏక్నా స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) క్రికెటర్ విరాట్ కోహ్లీ, లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య.. విరాట్ కోహ్లీ, లక్నో బౌలర్ నవీనుల్ హక్ మధ్య మాటల యుద్ధం జరగడం చూశాం. ఎవరూ తగ్గేదేలే అన్నట్టు వ్యవహరించారు. దీంతో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ ఇద్దరికీ నూరు శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించారు. నవీనుల్ హక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా చెల్లించాలని ఆదేశించారు.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలో ఎన్నో నిబంధనలు ఉన్నాయి. కోహ్లీ, గంభీర్ లపై ఆర్టికల్ 2.21 (ప్రవర్తన) కింద ఐపీఎల్ ఈ చర్య తీసుకుంది. నవీనుల్ హక్ లెవల్ 1 నేరానికి పాల్పడినట్టు నిర్ధారించారు. నిజానికి వీరికి ఈ జరిమానాలు చాలవని, కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ చోటు చేసుకోకుండా, క్రీడా స్ఫూర్తిని పెంచే చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

మ్యాచ్ ఫీజు అంటే ఒక్కో మ్యాచ్ కోసం ఆటగాడికి చెల్లించే సగటు మొత్తంగా భావించొచ్చు. ఉదాహరణకు కోహ్లీకి బెంగళూరు జట్టు రూ.15 కోట్ల పారితోషికాన్ని చెల్లిస్తోంది. ఐపీఎల్ లీగ్ దశలో 14 మ్యాచ్ లు ఉంటాయి. ఫైనల్ వరకు వెళితే మరికొన్ని ఆడాల్సి ఉంటుంది. కనుక రూ.1.07 కోట్ల మేర ఒక మ్యాచ్ ఫీజు ఉండొచ్చు. నిజానికి ఈ ఫీజుని వారు సొంతంగా చెల్లించరు. వారి తరఫున ఆయా ఫ్రాంచైజీలే రిఫరీ విధించిన జరిమానాలను చెల్లిస్తుంటాయి. ఈ సంప్రదాయం అలా కొనసాగుతూ వస్తోంది. దీంతో ఆటగాళ్లలో క్రీడాస్ఫూర్తి దెబ్బతింటోంది. వారితోనే చెల్లించేలా చేస్తే అప్పుడైనా ఇలాంటివి జరగవేమో చూడాలి.


More Telugu News