అవకాశాల కోసం పిచ్చికుక్కలా తిరిగాను: సీనియర్ నటుడు హేమసుందర్

  • 1970లలో ఎంట్రీ ఇచ్చిన హేమసుందర్ 
  • కేరక్టర్ ఆర్టిస్టుగా 400 సినిమాలకి పైగా పూర్తి 
  • ఈ తరం హీరోలతో చేయలేదని వెల్లడి
  • రాజమౌళిని ప్రశంసించిన హేమసుందర్
హేమ సుందర్ .. నిన్నటితరం ప్రేక్షకులకు ఆయన నటన గురించి తెలుసు. 1970లలోనే ఆయన తెలుగు తెరకి పరిచయమయ్యారు.  జడ్జి పాత్రలలో .. డాక్టర్ పాత్రలలో .. మధ్యతరగతి ఆడపిల్లల తండ్రి పాత్రలలో ఆయన మెప్పించారు. ఆయన వాయిస్ .. డైలాగ్ డెలివరీ ప్రత్యేకంగా ఉంటాయి.

తాజాగా 'తెలుగు వన్' కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హేమసుందర్ మాట్లాడుతూ .. "ఇప్పుడు నాకు 80 ఏళ్లు .. 400 సినిమాలకి పైగా నటించాను. కానీ చాలామందికి జడ్జి పాత్రలు మాత్రమే గుర్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలలో చేసిన పాత్రలు మాత్రమే గుర్తున్నాయి. నిజానికి అంతకంటే మంచి పాత్రలను నేను చాలానే చేశాను" అని అన్నారు. 

'విచిత్ర బంధం' నా ఫస్టు సినిమా. 'నాలాగ ఎందరో' సినిమా నటుడిగా నాకు మంచి పేరు తీసుకుని వచ్చింది. ఆ తరువాత నేను వేషాల కోసం తిరిగింది లేదు. అంతకుముందు మాత్రం సినిమా ఆఫీసుల చుట్టూ పిచ్చికుక్కలా తిరిగాను. ఇప్పుడున్న స్టార్ హీరోలను ఎవరినీ కూడా నేను బయట చూడలేదు. దర్శకుల విషయానికివస్తే, రాజమౌళి గారికి ఉన్న క్లారిటీ మరొకరికి లేదేమో అనిపిస్తుంది. నా జీవితంలో నా ఊహకి అందని సినిమా ఏదైనా ఉందంటే అది 'బాహుబలి'నే అని చెప్పుకొచ్చారు. 



More Telugu News