గాల్లో దీపంలా ఐటీ ఉద్యోగాలు.. 3,500 మందిపై వేటు వేయనున్న కాగ్నిజెంట్

  • ఖర్చులు తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టిన ప్రముఖ ఐటీ సంస్థ
  • కొన్ని కార్యాలయాలను కూడా మూసివేసేందుకు నిర్ణయం
  • వెల్లడించిన కంపెనీ కొత్త సీఈవో
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఉద్యోగాలు గాలిలో దీపంలా మారాయి. పేరున్న ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలకూ భరోసా లేకుండా పోయింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల కోత కొనసాగుతూనే ఉంది. విప్రో, అమెజాన్, యాక్సెంచర్, ఇన్ఫోసిస్ బాటలో మరో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ కూడా చేరింది. త్వరలో 3,500 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇవ్వనుంది. తమ వ్యయాలను తగ్గించుకునేందుకు వేలాది మంది ఉద్యోగులను వదులుకునేందుకు సిద్ధమైన విషయాన్ని కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్‌ తెలిపారు. ఇది మాత్రమే కాకుండా, ఖర్చును మరింత తగ్గించడానికి కంపెనీ 11 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ స్థలాన్ని కూడా వదులుకోనుంది. పలు ప్రదేశాల్లో తమ కార్యాలయాలను మూసివేయనుంది.

2023లో తమ ఆదాయాలు తగ్గుముఖం పడతాయని కాగ్నిజెంట్ అంచనా వేసిందని మనీ కంట్రోల్ వెబ్ సైట్ నివేదించింది. కంపెనీ మార్జిన్లు పరిశ్రమలో అత్యల్పంగా 14.6 శాతంగా ఉన్నాయని పేర్కొంది. ఈ క్రమంలో ఉద్యోగులను తొలగించేందుకు కాగ్నిజెంట్ యోచిస్తున్నట్లు సీఈవో రవి కుమార్ ఎస్ వెల్లడించారు. యాక్సెంచర్, ఇన్ఫోసిస్, టిసిఎస్ నుంచి పోటీని ఎదుర్కొంటున్న కంపెనీని పునరుద్ధరించడానికి రవి కుమార్ చేపట్టిన చర్యల్లో 3,500 మంది ఉద్యోగులను తొలగించడం, కార్యాలయ స్థలాలను తగ్గించడం వంటివి ఉన్నాయని మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది. 

ప్రస్తుతానికి, ఈ నిర్ణయం వల్ల మన దేశంలో ఎంత మంది ఉద్యోగులు ప్రభావితమవుతారనేది తెలియరాలేదు. కాగ్నిజెంట్ అమెరికాకు చెందిన కంపెనీ. కానీ, భారత్ కేంద్రంగా దాని ప్రధాన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు చర్యలతో భారత టెకీలపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.


More Telugu News