ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆ మొత్తం రిఫండ్

  • చార్జర్ కు చెల్లించిన మొత్తం వెనక్కి
  • తిరిగి చెల్లించేందుకు అంగీకరించిన సంస్థలు
  • ఓలా, ఏథర్, హీరో మోటో, టీవీఎస్ మోటార్ అంగీకారం
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం కొనుగోలు చేసిన వారికి గుడ్ న్యూస్. తాము కొనుగోలు చేసిన వాహన చార్జర్ల మొత్తాన్ని తిరిగి పొందనున్నారు. ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, హీరో మోటో కార్ప్, టీవీఎస్ మోటార్ ఎలక్ట్రిక్ వాహన చార్జర్ కోసం కస్టమర్ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు అంగీకరించాయి. 

కేంద్ర ప్రభుత్వం దేశంలో ఎలక్ట్రిక్ వాహన వినియోగాన్ని పెంచేందుకు ఫేమ్-2 కింద సబ్సిడీలను ఇస్తోంది. ఒక్కో వాహనానికి పెద్ద మొత్తంలోనే ఇలా చెల్లిస్తోంది. కేంద్ర సర్కారు లక్ష్యానికి తూట్లు పొడుస్తూ వాహన కంపెనీలు చార్జర్లకు సైతం అదనంగా వసూలు చేస్తున్నాయి. దీంతో కేంద్ర సర్కారు ఆయా సంస్థలకు ఫేమ్-2 కింద సబ్సిడీలను నిలిపివేసింది. దీంతో చార్జర్ల కోసం వసూలు చేసిన మొత్తం రూ.300 కోట్లు చెల్లించేందుకు  ఓలా, ఏథర్, హీరో మోటో, టీవీఎస్ మోటార్ అంగీకరించాయి. సుమారు రూ.300 కోట్ల రూపాయిలను ఇవి ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి చెల్లించనున్నాయి. దీంతో ఆయా కంపెనీలు తిరిగి ఫేమ్-2 పథకం కింద సబ్సిడీలు పొందేందుకు అవకాశం లభిస్తుంది. 

కస్టమర్ల విశ్వాసాన్ని అలాగే కొనసాగించేందుకు వీలుగా వారికి చార్జర్ ధరను తిరిగి ఇవ్వనున్నట్టు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ‘‘స్వార్థపర శక్తులు కొన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఈవీ పరిశ్రమ గత కొన్నేళ్లలో అసాధారణ ప్రగతిని చూసింది’’ అని ఓలా ప్రకటించింది.


More Telugu News