ఛత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం.. 11 మంది దుర్మరణం

  • ట్రక్కును ఢీ కొట్టిన కారు.. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు 
  • బాలోద్ లో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఘోరం
  • బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళుతుండగా ప్రమాదం
ఛత్తీస్ గఢ్ లో బుధవారం అర్ధరాత్రి తర్వాత ఘోర ప్రమాదం జరిగింది. బాలోద్ జిల్లాలో కాంకేర్ జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండు మంది దుర్మరణం పాలయ్యారు. ఓ బాలిక మాత్రం ప్రాణాలతో బయటపడింది. ప్రమాదం విషయం తెలిసి అక్కడికి చేరుకున్న పోలీసులు బాలికను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం రాయ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ధామ్ తరీ జిల్లాలోని సోరెమ్ భట్ గావ్ కు చెందిన ఓ కుటుంబం కాంకేర్ జిల్లాలోని బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకకు బుధవారం రాత్రి కారులో బయలుదేరారు. కారులో డ్రైవర్ సహా మొత్తం 12 మంది ఉన్నారు. అర్ధరాత్రి దాటాక కాంకేర్ హైవేపై వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీ కొట్టింది. దీంతో కారు నుజ్జునుజ్జయింది.

ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు మహిళలు, ఓ చిన్నారి సహా పదకొండు మంది తీవ్రగాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఓ చిన్నారి ప్రాణాలతో బయటపడగా.. పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ముఖ్యమంత్రి భూపేశ్ భఘేల్ ట్విట్టర్ లో స్పందించారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, గాయపడిన బాలిక త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.


More Telugu News