సీఎం కేసీఆర్​ కు బండి సంజయ్ లేఖ

  •  జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే 
    రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్
  • దీని కోసం 9,350 మంది ఉద్యోగులు ఆరు రోజులుగా 
    ఆందోళన చేస్తున్నారన్న సంజయ్
  • వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించకుంటే బీజేపీ తరఫున 
    ఉద్యమిస్తామని హెచ్చరిక
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. 4 ఏళ్ల ప్రొబేషనరీ కాలం పూర్తయిన ఉగ్యోగులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆరు రోజులుగా రాష్ట్రంలోని 9,350 మంది జూనియర్ పంచాయితీ కార్యదర్శులు ఆందోళన చేస్తున్నారని సంజయ్ తెలిపారు. వారి డిమాండ్ సమంజసమైనదన్నారు. రాష్ట్రంలో ఇకపై కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి అనే పదమే ఉండదని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన సీఎం కేసీఆర్ ఆ మాటను నిలబెట్టుకోవాలని సంజయ్ గుర్తు చేస్తున్నారు. 

పోటీ పరీక్షల్లో రాసి అర్హత సాధించి ఉద్యోగంలో చేరిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పదవీ కాలం పూర్తయి నాలుగేళ్లు దాటినా వారిని ఇంతవరకు రెగ్యులరైజ్ చేయకపోవడం అన్యాయం అన్నారు. మూడేళ్ల ప్రొబేషనరీ కాలాన్ని మరో ఏడాది పొడిగించినప్పటికీ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వర్తించారని, గడువు దాటినా రెగ్యులరైజ్ చేయకపోవడం దారుణమని లేఖలో అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి వారి ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆ ఉద్యోగులతో కలిసి బీజేపీ ఉద్యమిస్తుందని బండి సంజయ్ హెచ్చరించారు.


More Telugu News